రాష్ట్రంలో తాజాగా మరో 4826 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం ఐదున్నర వరకు 65,923 మందికి పరీక్షలు చేయగా 4826 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 32 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2771కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటింది. మొత్తం 5,02,187 కేసుల్లో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 62,797. కొవిడ్ బారి నుంచి మరో 7754 మంది కోలుకున్నారు. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,36,619కి చేరుకొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 86.94శాతం, మరణాల శాతం 0.55శాతం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 723 ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా కేవలం ఐదు కేసులు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 121 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్లో 20, కొమురం భీం ఆసిఫాబాద్లో 16, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 12 చొప్పున మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. నిర్మల్, గద్వాలలో 9 చొప్పున, రంగారెడ్డిలో 8, ఖమ్మంలో ఆరు జోన్లు ఉన్నట్లు తెలిపింది. యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజ్గిరిలో ఐదు చొప్పున, భూపాలపల్లి, వికారాబాద్లో నాలుగు చొప్పున మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కొత్తగూడెంలో రెండు, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒకటి చొప్పున జోన్లు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీ చూడండి: సరిహద్దులో పోలీసుల ఆంక్షలు.. బాధితుల విజ్ఞప్తులు..