కోళ్లకు కరోనా వస్తుందన్న వార్తలను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి కొట్టిపారేశారు. మనుషుల నుంచి కోళ్లకు వైరస్ సోకే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన ద్వారా మాంసాహార ప్రియులకు సూచించారు. కోళ్లకు కొవిడ్ వచ్చినట్లు ఇప్పటి వరకు ప్రపంచంలో పరిశోధనాత్మకంగా ఎక్కడా నిర్ధరణ కాలేదని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం వస్తే పశుసంవర్ధక శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే అసత్యాలు ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత సమయంలో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండటానికి పౌష్టికాహారంతోపాటు, రోగ నిరోధక శక్తి పెంచే కోడి గుడ్లు, చికెన్ కూడా తినడం ఉత్తమైందని డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.