ఆంధ్రప్రదేశ్‌లో టీకా కేంద్రాల్లో ఇకపై రెండో డోసు మాత్రమే ఇస్తారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో...వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా వివరాలను తెలియజేశారు. కొత్తగా పేర్లు నమోదుచేసుకున్నవారికి టీకా వేసే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. ఇప్పటి వరకూ కేంద్రం నుంచి 73 లక్షల 49 వేల 960 టీకా డోసులు వచ్చాయని సింఘాల్ తెలిపారు. 53 లక్షల 58 వేల 712 మందికి డోసులు వేశామన్నారు. వారిలో 17 లక్షల 96 వేల మందికి రెండో డోసులు వేశామన్నారు. శుక్రవారం ఉదయానికి 2 లక్షల డోసులు మిగిలి ఉన్నాయని...వాటిని రెండో డోసులు వేయాల్సిన వాళ్లకు ఇస్తామని చెప్పారు. 45 ఏళ్లకు పైబడి ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి 15 లోగా 9 లక్షల డోస్‌లు కేటాయించగా...వాటిలో 6 లక్షల 90 వేల కొవిషీల్డ్ డోసులు పూర్తిగా వచ్చాయన్నారు. ఇంకా లక్ష 8 వేల డోసులు ఈ నెల15వ తేదీలోగా రావాల్సి ఉందన్నారు. మే నెల చివరి రెండు వారాల్లో వ్యాక్సినేషన్‌కూ టీకాలను కేంద్రం కేటాయించింది. అవి మే 15 తరువాత రాష్ట్రానికి వస్తాయన్నారు.
డోసులకు ఆర్డర్ ఇచ్చాం..
ఏపీ ప్రభుత్వం 9 లక్షల 91 వేల కొవిషీల్డ్.. 3 లక్షల 43 వేల కొవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 45 కోట్లు చెల్లించినట్లు అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇప్పటికే కేటాయించిన కొవిషీల్డ్ డోసులతో పాటు మరో మూడునర్న లక్షల డోసులు అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, వాటిని మే మూడో వారంలో అందజేస్తామని సీరం యాజమన్యం ఈ మెయిల్ ద్వారా తెలిపిందన్నారు. అదనపు డోసులకూ చెల్లింపులు చేయటానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిందన్నారు. 3 లక్షల 43 వేల కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో...లక్ష 43 వేల డోసులు ఇప్పటికే వచ్చాయన్నారు. రాష్ట్రం కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్లను..45 ఏళ్లకు పైబడినవారికి వేయాలని కేంద్రానికి తెలిపామన్నారు. ఇదే విషయమై మరోసారి కేంద్రానికి నివేదిస్తామన్నారు.
రెమ్‌డెసివర్ కొరత లేదు
ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కొరతలేదని...తాజాగా 13 వేల 150 ఇంజెక్షన్లు అందజేశామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 వేల 105 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే కరోనా రోగుల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పడకలు, ఇతర పడకలు ఏవిధంగా ఉపయోగించాలన్నదానిపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. రాష్ట్రంలోని 49 జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో రూ. 309 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 3 నెలల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. కేంద్రం గురువారం 480 టన్నుల ఆక్సిజన్ కేటాయిచగా, శుక్రవారం 500 టన్నులు అందజేసిందన్నారు. వాటిలో 470 టన్నులు రాష్ట్రంలోని ఆసుపత్రులకు సరఫరా చేశామన్నారు.
వారికి నియామకాల్లో వేయిటేజ్
కొవిడ్ సేవల్లో తాత్కాలిక ప్రాతిపదిక పనిచేస్తున్న తమకు వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కరోనా మొదటి వేవ్‌లో పనిచేసిన హెల్త్‌వర్కర్లకు 15 శాతం మేర వెయిటేజ్ ఇవ్వాలని మెమో జారీచేశామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొవిడ్ టీకా మొదటి డోసు నిలిపివేత