Ancient Food India: నేటితరం యువత ఉన్నత చదువులు, ఆకర్షణీయమైన వేతనాలు పొందుతున్నా... సంతృప్తి చెందడం లేదు. ఈ యువతి అంతే. దాంతో ఏదైనా వినూత్నంగా చేయాలనుకుంది. తల్లి ప్రోత్సాహంతో మిల్లెట్ వ్యాపారం ప్రారంభించింది. కల్తీలకు ఆస్కారం లేని సంప్రదాయ చిరు ధాన్యాలు తయారు చేసి.. అనేకరకాల ఆహారోత్పత్తులు అందిస్తుంది. వాటిని ఆన్‌లైన్ మార్కెటింగ్ చేస్తూ మంచి ఆదాయం అందుకుంటోంది.
Ancient Food India Products : హైదరాబాద్ నాగోల్ అల్కాపురికి చెందిన ఈ ఉన్నత విద్యావంతురాలి పేరు దేవరగట్ల లక్ష్మీ హరిత భవాని. ఎంటెక్ పూర్తి చేసి... ఇబ్రంహీపట్నం గురు నానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా ఐదేళ్లపాటు పనిచేసింది. వివాహం అనంతరం మరో సంస్థలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పని చేసింది. ఏ కొలువు చేసిన పెద్దగా సంతృప్తి ఇవ్వకపోవడంతో ఆలోచన వ్యాపారం వైపు మళ్లింది.
Ancient Food India in Hyderabad : వ్యాపార ఆలోచన మదిలో ఉండగానే హరితా భవానికి అబ్బాయి పుట్టాడు. అయితే చిన్నప్పటి నుంచి మంచి ఆహార అలవాట్లు ఉండడం వల్ల డెలివరీ సమయంలో ఎదురయ్యే ఆరోగ్యసమస్యల నుంచి చాలా వేగంగా కోలుకుంది భవాని. తర్వాత తనలాంటి సమస్య మరొకరికి రావద్దు అనుకుంది. ఆ ఆలోచనకు తల్లి తల్లి ఉమామహేశ్వరితో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభించడంతో వ్యాపారం వైపు అడుగులు వేసింది.
ఏన్షియంట్ ఫుడ్ ఇండియా : రాజేంద్రనగర్ ఉన్న ఐసీఏఆర్‌లోని మిల్లెట్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందింది భవాని. ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు ఉత్పత్తులు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో 2021లో ఏన్సియంట్ ఫుడ్ ఇండియా పేరిట 5 లక్షల రూపాయల పెట్టు బడితో ఇంట్లోనే చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీ, విక్రయాలకు శ్రీకారం చుట్టింది.
చిన్నారులు, యువత, వృద్ధులు అధికంగా తినే ఫైబర్ గల హెల్త్ మిక్స్, స్వీట్లు, పొంగల్ మిక్స్, జొన్న, రాగి, సజ్జ లడ్డూలు వంటి సహజ ఉత్పత్తుల్ని తయారు చేసింది. మైదా, సోడా, పంచదార... అనే తెల్ల పదార్థాలకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ బెల్లం, ఖర్జూరం, తేనె, ఇతర చిరుధాన్యాల పిండిని ఈ ఉత్పత్తుల్లో వాడుతున్నామని చెబుతోంది భవాని. పూర్తిగా సహజ పదార్థాలు, పద్ధతులతో చేసిన ఈ మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు భవాని తల్లి ఉమామహేశ్వరి. స్వచ్ఛమైన ఆహారం అందరికి అందాలని ఈ యువతి చేస్తోన్న ప్రయత్నానికి కుటుంబ సభ్యులు కూడా అండగా ఉంటున్నారు.
త్వరలోనే ఫ్రాంఛైజీలు.. ప్రస్తుతం ఈ అంకురసంస్థలో రోజుకు 80 కిలోల సామర్థ్యంతో చిరుధాన్యాల ఉత్పత్తులు తయారవుతున్నాయి. త్వరలో 100 కిలోల సామర్థ్యానికి విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు . ఆహారోత్పత్తుల తయారీ కోసం స్థానికంగా ఉన్న ఐదుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది భవాని. రైతుల నుంచి నేరుగా నాణ్యమైన చిరుధాన్యాలు సేకరించి ఆన్‌లైన్ వేదికగా విక్రయిస్తోంది. త్వరలో తెలుగురాష్ట్రాల్లో ఉన్న ఔత్సాహిక మహిళలకు మిల్లెట్ స్టోర్ల ఫ్రాంఛైజీలు ఇచ్చి వ్యాపార సేవలు విస్తృతం చేసే ఆలోచనల్లో ఉన్నారు.