అనంతగిరి రిజ్వాయర్ భూసేకరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని.. ఇందుకు సంబంధించి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విచారణ చేపట్టాలంటూ జాతీయ కమిషన్కు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి... ఆర్డీవో, భూ సేకరణాధికారి అనంతరెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్... చిన్న కొండూరు తహసీల్దార్ శ్రీనివాసరావు... గతంలో పని చేసిన తహసీల్దార్ పరమేశ్వర్ సర్వీసుకు చెందిన వార్షిక రహస్య నివేదికల్లో వారి నిర్వాకాలపై వ్యతిరేక వ్యాఖ్యలు నమోదు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
చర్యలకు సిఫారసు..
పిటిషనర్లలో 11 మంది ఎస్సీలున్నారని... వారిని అర్ధరాత్రి బలవంతంగా ఖాళీ చేయించడం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఈ అధికారులపై విచారణ జరిపి ఉల్లంఘనకు పాల్పడినట్లయితే తగిన చర్యలు సిఫారసు చేయాలంటూ... జాతీయ ఎస్సీ కమిషన్కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 3 పిటిషన్లలోని పిటిషనర్లు 61 మందికి ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు చొప్పున చెల్లించాలంటూ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అనంతగిరి రిజర్వాయరు నిమిత్తం చేపట్టిన భూ సేకరణలో... ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయకుండా బలవంతంగా ఖాళీ చేయించడంపై 61 మంది బాధితులు వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారించిన ధర్మాసనం పిటిషన్లను అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.
ఉల్లంఘన..
2016 జూన్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉల్లంఘించి... బలవంతంగా భయపెట్టి విక్రయ ఒప్పందాలపై సంతకాలు తీసుకున్నారని... ఇది అన్యాయం, రాజ్యాంగంలోని అధికరణం 14, 300ఏకు, భూ సేకరణ చట్టానికి విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొంది. భూముల ధరను నిర్ణయించడంలోనూ ఏకపక్షంగా వ్యవహరించారని తప్పుబట్టింది. పిటిషనర్లకు చెందిన భూమికి భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం నిర్ణయించి 3 నెలల్లో చెల్లించాలంది. ముందుగా వారికి నోటీసులు జారీ చేసి వారి వాదనను విన్నాక... పరిహారం నిర్ణయించాలని స్పష్టం చేసింది.
భూమి విలువ ఆధారంగా పరిహారం..
పిటిషనర్ల నుంచి భూములను తీసుకున్న 2018 జనవరి 15 నాటి భూమి విలువ ఆధారంగా పరిహారం నిర్ణయించాలంది. ఒకవేళ ఇప్పటికే చెల్లించినట్లయితే ఆ మొత్తాన్ని రికవరీ చేయరాదని... పరిహారం నిర్ణయించాక సర్దుబాటు చేయాలంది. ఇళ్లు, నిర్మాణాలు, చెట్లకు పరిహారం నిర్ణయించి చెల్లించాలంది. ఇప్పటికే పంపిణీ చేసిన చెక్కులకు బ్యాంకులు సొమ్ము చెల్లించేలా... జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంది. 2018లో భూములను, 2020లో ఇళ్లను వేర్వేరు నోటిఫికేషన్ల కింద సేకరించినందున... వేర్వేరుగానే ఆర్ఆర్ చట్టం కింద పరిహారం లెక్కించి చెల్లించాలని ఆదేశించింది. అవివాహితులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించి వివాహిత కుటుంబాలకు కల్పించిన ప్రయోజనాలన్నీ... 3 నెలల్లో కల్పించాలంటూ 52 పేజీల తీర్పులో ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్