ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషధం (Anandaiah Medicine) పంపిణీపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం (State Government) తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయుష్ కమిషనర్ రాములు ( Ayush Commisone Ramulu) తెలిపారు. శనివారం చివరి నివేదిక రానున్నట్లు స్పష్టం చేశారు. ఈ నివేదికలను మరోసారి అధ్యయన కమిటీ పరిశీలిస్తుందన్నారు.
సీసీఆర్ఏఎస్ నివేదిక కూడా వచ్చే అవకాశం..
కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఆర్ఏఎస్ ( CCRAS ) అధ్యయన నివేదిక కూడా శనివారమే వచ్చే అవకాశం ఉందన్నారు. ఆనందయ్య మందుపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, దీనిపై సోమవారం విచారణ జరగనుందన్నారు. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
సీఎం జగన్ సమీక్ష..
కరోనా వ్యాప్తి నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని (Nellore,Krishna Patnam) ఆనందయ్య మందుల పంపిణీపైనా చర్చించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన విచారణ నివేదికలన్నీ సానుకూలంగానే ఉన్నట్లు వివరించారు.
అలాంటి ఫిర్యాదులు ఏమీ లేవు..
ఆనందయ్య ఇచ్చిన ఔషధంతో ఎక్కడా ఎవరూ చనిపోయినట్లు తమకు ఫిర్యాదులు అందలేదన్నారు. ఈ మందు తీసుకున్న వారితో టెలిఫోన్ ద్వారా నిర్వహించిన విచారణలో చాలా మంది సానుకూలంగా చెప్పారని కమిషనర్ రాములు అన్నారు.
'అప్రమత్తం అవసరం'
ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించలేదని, ఎక్కడైనా ( Clinical Trials ) క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లైతే అది అధికారికంగా చేపట్టింది కాదని ప్రజలు ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆనందయ్య దరఖాస్తు చేయాలి..
ఔషధం పంపిణీకి తొలుత ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని రాములు స్పష్టం చేశారు. కంటి మందు వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. ఒక వేళ మందు పంపిణీ చేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు.
ఇవీ చూడండి : drugs case: డ్రగ్స్ కేసులో సుశాంత్‌సింగ్ స్నేహితుడు అరెస్ట్