Pollution in Telugu States: ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఏ నగరమూ లేకపోగా కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశించిన ప్రమాణాలకంటే ఎక్కువ కాలుష్యం హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఉంది. పది దక్షిణాది నగరాల్లోని సీపీసీబీ డేటాను బెంగళూరుకు చెందిన గ్రీన్ పీస్ ఇండియా సొసైటీ విశ్లేషించినప్పుడు ఈ అంశాలు వెలుగు చూశాయి. గురువారం ఆ వివరాలు వెల్లడయ్యాయి. 2020 నవంబరు 20 నుంచి గత ఏడాది నవంబరు 20 వరకు డేటాను సొసైటీ విశ్లేషించింది. దేశంలో వాయు కాలుష్యంతో సక్రమించే వ్యాధులు, వాటి ప్రభావంతో ఏటా సుమారు 11 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని పేర్కొంది.
విశ్లేషణకు ఎంచుకున్న నగరాలు
బెంగళూరు, హైదరాబాద్, అమరావతి(మహారాష్ట్ర), చెన్నై, విశాఖపట్నం, పుదుచ్చేరి, కోయంబత్తూరు, మైసూరు, కోచి, మంగళూరు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల్లో ఇలా
అధ్యయనం చేసిన అన్ని నగరాల్లోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినదాని కంటే ఎక్కువ కాలుష్యం ఉంది. విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఏడు నుంచి ఎనిమిది రెట్లు పెరిగింది. బెంగళూరు, అమరావతి, మంగళూరులలో ఆరురెట్ల నుంచి ఏడు రెట్లు పెరిగింది. కోచి, మైసూర్, పుదుచ్చేరిలలో నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగింది.
సీపీసీబీ ప్రమాణాల ప్రకారం...
హైదరాబాద్, విశాఖపట్నం మినహా మిగిలిన ఎనిమిది నగరాల్లో సీపీసీబీ నిర్ణయించిన ప్రమాణాల్లోనే కాలుష్యం ఉంది. విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఎన్‌ఏఏక్యూఎస్(నేషనల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ స్టాడంర్డ్స్) నిర్దేశించిన ప్రమాణకంటే 1.5 రెట్ల నుంచి రెండు రెట్లు ఎక్కువగా ఉంది.
కాలుష్యం నియంత్రణకు సూచనలు
- సంప్రదాయేతర ఇంధనవనరులను ఉపయోగించాలి. పరిశ్రమల కాలుష్యం తగ్గాలి. పెట్రోలు, డీజిల్ వాహనాలను నియంత్రించాలి.
- వాయు కాలుష్యంలో రక్షిత స్థాయి అనేది లేదు. అది ఏ స్థాయిలో ఉన్నా ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే అంశమని గుర్తించాలి.
- నడక, సైక్లింగ్, దూరప్రాంతాలకుఈ-బస్సులు, ట్రైన్‌లు ప్రోత్సహించాలి.
- కార్ల వినియోగానికి ఒక రోజు విరామం ఇవ్వాలి. పచ్చదనం పెంచాలి.
ఇదీ చూడండి: Fire accident: గుడిసెలో అగ్ని ప్రమాదం.. మహిళ సజీవ దహనం