ప్రకృతికి రక్షణ కవచాలు
‘మేం ఉద్యోగులుగా పనిచేయం. ఉపాధి కల్పించే వ్యాపారాలను విస్తరిస్తా’మంటున్నారు ఇంటర్ విద్యార్థినులు ప్రగ్య, మృధు. ‘ప్రగ్య ఊర్జా యూత్ ఎనర్జీ మ్రిదు(పోయమ్)’ పేరుతో అంకుర సంస్థకు రూపమిచ్చారు. వ్యర్థాలు కలుషితమై పర్యావరణానికి సవాల్ విసురుతున్నాయి. వాటిని రోజువారీ ఉపయోగించే వస్తువులుగా మార్చడమే తమ సంస్థ ఉద్దేశమన్నారు. టూత్‌బ్రష్ నుంచి చేతి సంచి వరకూ ఎన్నో వీరి జాబితాలో ఉన్నాయి. రూ.3 లక్షలతో వ్యాపారం ప్రారంభించామంటున్నారు. ఔట్‌సోర్సింగ్ ద్వారా తయారు చేస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.
మూగజీవులు.. పర్యావరణం
క్రిత్తిక్, కీర్తి 8వ తరగతి విద్యార్థులు. ‘క్రిత్తిక్.. పెట్టర్’ అంకురం ద్వారా పెంపుడు జంతువులకు అవసరమైన సేవలు అందించాలనుకుంటున్నారు. శునకాలు, పిల్లులు, చేపలు, పక్షులు ఇలా ప్రతి దానికీ ప్రత్యేకమైన విభాగంగా మలచి వైద్యనిపుణులు, సేవలు అన్నీ ఒకే వేదికగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ‘పర్యావరణం బావున్నపుడు మాత్రమే ప్రపంచం అందంగా ఉంటుందనే ఆలోచన’తో వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్నట్టు వివరించారు.
ఇంటింటా పండుగ కళ
పండుగొస్తే అలంకరణలు, పిండివంటలు.. ఇలా ఎన్నో పనులుంటాయి. నగర జీవనంలో వీటిని సమన్వయం చేసుకోవటం సవాల్ అంటున్నారు పదో తరగతి విద్యార్థిని మాన్య. అన్ని వర్గాల వారు పండుగలను ఆనందంగా జరుపుకొనేందుకు తాము ఆన్‌లైన్ ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. ‘నిరా’ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించారు. పండుగకు అవసరమైన వస్తువులు బయటకు వెళ్లి తెచ్చుకోవటం ఇబ్బందిగా ఉందంటూ.. ఓ బంధువు అనడమే ఇందుకు ప్రేరణ. ముగ్గులేయటం, ఇల్లు శుభ్రం చేయటం వంటి వాటితో పాటు పూజా వస్తువులు, సేవలు ఆన్‌లైన్ ద్వారా అందిస్తారు.
అభిరుచుల పాఠాలు
సృజనాత్మకతను పెంచుకునేందుకు అభిరుచులు చక్కగా పనిచేస్తాయంటున్నారు 8వ తరగతి చదివే నియతివర్మ. చిన్నపుడు ఎంపిక చేసుకోవటంలో.. అలవాట్లను కొనసాగించేందుకు అవకాశాలుండవు. దీనికి పరిష్కారంగా మా ‘హాబ్- హాప్’ బాసటగా ఉంటుందన్నారు. చిత్రలేఖనం, నటన, సంగీతం, చదరంగం, వస్తుసేకరణ వంటి వాటిని ఆన్‌లైన్ వేదికగా సేవలు అందిస్తామని వివరించారు. డిజిటల్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌తో తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించాలనే అంకుర సంస్థను ప్రారంభించామన్నారు.
1200 ఆలోచనలు.. 150 అంకురాలు
పిల్లల్లో కొత్త ఆలోచనలు పెంచే శిక్షణకు మంచి స్పందన వస్తోందని మెటా మోర్ఫోసిస్ వ్యస్థాపకుడు పవన్ అల్లెన చెప్పారు. కొద్ది సమయంలోనే 50 వేల మంది విద్యార్థులకు శిక్షణనిచ్చామన్నారు. వీరి నుంచి 1200 ఆలోచనలు వచ్చినట్లు చెప్పారు. వీటిలో 150 ఆలోచనలు అంకురాలుగా రూపుదిద్దుకున్నట్టు వివరించారు. వ్యాపార రంగాల్లో ఎత్తుపల్లాలు చూసి ఉన్నతంగా ఎదిగిన వారి అనుభవాలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.
- ఇవీచూడండి: కరోనా వైరస్ మళ్లీ జూలు విదిలిస్తోందా..?