ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తోన్నాయి. ఇటీవలే ఫంగస్ బారిన పడి.. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో పలువురు బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలో కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తున్నందున.. దీనిపై పూర్తి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో సగటున రోజుకు వెయ్యి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. రెండు రోజులు కొద్దిగా తగ్గినట్లు అనిపించినా.. మళ్లీ మంగళవారం పెరిగాయి. మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. మంగళవారం 10 మంది కరోనాతో చనిపోయారు. సగటున 9 మంది రోజుకు మరణిస్తున్నారు. మొదటి, రెండో దశలో కలిపి 882 మంది మృతి చెందారు. రెండో దశలోనే ఇది ఎక్కువగా ఉంది. గత రెండు నెలల్లో 200 మంది మృతి చెందడం గమనార్హం. ప్రస్తుతం కొవిడ్ నుంచి కోలుకున్న వారికీ ఈ కొత్త వైరస్ సోకుతోంది.
ప్రధానంగా.. ఫంగస్ ముక్కు ద్వారానే ప్రవేశిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ను జయించామని.. నిర్లక్ష్యంతో ఉండకూడదని, మాస్క్ రక్షణగా ఉంటుందంటున్నారు. కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్ ఎక్కువగా వినియోగించడం వల్ల వారిలో షుగర్ స్థాయిలు ఎక్కువవుతున్నాయి. ఇలా ఎక్కువైన వారికి త్వరగా వైరస్ అంటుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. ముక్కు ద్వారా ప్రవేశించి.. కళ్లు ఇతర భాగాలు, మెదడుపై ప్రభావం చూపుతాయని, మృత్యు రేటు ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో 10 వరకు ఉన్నట్లు గుర్తించారు. గన్నవరం ప్రాంతంలో 8 మందికి వచ్చినట్లు, విజయవాడ ప్రైవేటు ఆసుపత్రుల్లో గుర్తించినట్లు తెలిసింది.
మందులు లేవు..!
బ్లాక్‌ఫంగస్ చికిత్సకు అవసరమైన మందులు లభించడం లేదు. వైద్యులు ఇదే చెబుతున్నారు. ఔషధ నియంత్రణ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. లిపోసోమాల్ ఆంఫిటెంపిన్ బీ అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. రోగి బరువును బట్టి ఈ ఇంజక్షన్‌లు ఎన్ని ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఈ రకం ఇంజక్షన్‌లు విజయవాడలో లభించడం లేదని ఓ వైద్యుడు చెప్పారు. కొన్ని రకాల మాత్రలు కూడా లభించడం లేదు. దీంతో చికిత్స సమస్యగా మారింది. ఇంతవరకు కొవిడ్ వైరస్‌పైనే దృష్టి సారించారు. కొవిడ్ అనంతరం స్టెరాయిడ్స్ వల్ల వచ్చే మ్యుకార్‌మైకాసిస్‌ను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే వ్యాధి వల్ల రెండు కళ్లు వైరస్ సోకి ఓ వ్యక్తి మరణించారు. మందుల కోసం అధికారులు ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు.
అవగాహన ముఖ్యం..!
ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పోస్ట్ కొవిడ్ వారికి ఎక్కువగా వస్తున్నాయి. పరీక్షలు చేస్తేనే ఈ వైరస్ ఉన్నట్లు గుర్తిస్తున్నాం. మా దగ్గరకు పది వరకు వచ్చాయి. కొన్ని నిర్ధారణ కావాల్సి ఉంది. ముందుగా ముక్కులోకి వైరస్ ప్రవేశిస్తుంది. కాబట్టి మాస్క్ ప్రామాణికం. కొవిడ్ జయించానని మాస్క్ ధరించకుండా ఇష్టానుసారం తిరగకూడదు. ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర ఉండి సాధారణ చికిత్సతో బయటపడిన వారికి ఇది సోకడం లేదు. స్టెరాయిడ్స్ వాడిన వారిలోనే కనిపిస్తోంది. డయాబెటిక్ స్థాయిలు బాగా పెరిగిన వారికి ఇబ్బందికరంగా మారుతోంది. ఇంజక్షన్లు, మందులు లభించడం లేదు. జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టాలి. -డాక్టర్ సింగరి ప్రభాకర్, ఈఎన్‌టీ వైద్య నిపుణులు
కాటూరు కార్యదర్శి మృతిపై విచారణకు ఆదేశం
ఉయ్యూరు మండలం కాటూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ కరోనాతో మరణించిన నేపథ్యంలో అతనికి బ్లాక్ ఫంగస్ వైరస్ కూడా సోకిందనే అంశంపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విచారణకు ఆదేశించారు. ఈ బ్లాక్ ఫంగస్‌తో మరణం సంభవించిందనే అనుమానంతో మండల ప్రజలు కొంత భయందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని కాటూరు పీహెచ్‌సీ డాక్టర్ సబీహ వద్ద ప్రస్తావించగా.. రాజశేఖర్ చికిత్స వివరాలు కోరగా.. అతడు టీకా రెండు డోసులు వేయించుకున్నారని, తీవ్ర చలితో ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఎంపీడీవో సునీతాశర్మ మాట్లాడుతూ జిల్లా కలెక్టరు విచారణకు ఆదేశించినట్టుగా ఇంకా సమాచారం రాలేదన్నారు.
పోరంకి వాసికి లక్షణాలు
పెనమలూరు మండలం పోరంకికి చెందిన తాడికొండ హరి అనే ఈ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కన్పించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన వ్యవసాయం చేస్తారు. కొద్దిరోజుల క్రితం కరోనా సోకగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా మంగళవారం బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడడంతో కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి ఆయనను రాత్రి సమయానికి పోరంకిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: తౌక్టే ధాటికి గుజరాత్లో 45 మంది మృతి