Ambedkar Statue Unveils in Hyderabad today : భారతదేశం, ప్రజలు, భవిష్యత్తు తరాలకోసం రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడిగా అంబేడ్కర్ చేసిన కృషి, త్యాగం అజరామరం. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడమంటే వారి అత్యున్నత ఆశయాలు భవిష్యత్ తరాలకు తెలియపర్చడమే. బాబాసాహెబ్.. తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం, ప్రత్యేక రాష్ట్రాల కోసం ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో రూపొందించి పొందు పరిచారని.. అదే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేందుకు మార్గం సుగమం చేసిందని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుంటారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఏడేళ్ల క్రితం బీజం పడింది. అంబేడ్కర్ 132వ జయంతి రోజున దేశంలోనే అతి ఎత్తైన రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.
అనుకున్నదే తడవుగా: రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయం ముందు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సమీపంలోనే సాగర్‌లో నెలకొన్న బుద్దుడి విగ్రహం కూడా నెలకొని ఉంటుంది. ఈ ప్రాంతంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సమావేశ మందిరం, ఓపెన్ ప్లాజా, లైబ్రరీ, పార్క్, పార్కింగ్ ప్లేస్, మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆ రోజు సీఎం కేసీఆర్ భావించారు. అనుకున్నదే తడవుగా సంబంధిత మంత్రులు, అధికారులను పిలిపించి అంబేడ్కర్ విగ్రహ ప్రణాళిక వివరించి వెంటనే అమలుకు ఆదేశాలు జారీ చేశారు. నాటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
కరోనాతో ఆలస్యం: అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటే లక్ష్యంగా కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు చైనాలోనూ విస్తృతంగా పర్యటించి విగ్రహాల ఏర్పాటుపై అధ్యయనం చేసింది. తర్వాత ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రభావంతో విగ్రహ ఏర్పాటు ఆలస్యమైంది. తదుపరి చోటుచేసుకున్న పరిణామాలకు అనుగుణంగా దేశీయంగానే విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా చర్యల్ని వేగవంతం చేశారు.
ఈ క్రమంలో విగ్రహ నమూనా ఖరారుకే చాలా సమయం పట్టింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాంవన్ జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ ఆధ్వర్యంలో విగ్రహ నమూనా రూపొందించారు. అతిపెద్ద కాంస్య విగ్రహం కోసం విగ్రహ భాగాలను దిల్లీలో పోతపోసి హైదరాబాద్‌కు తరలించారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పేరుస్తూ పటిష్ఠంగా విగ్రహాన్ని రూపొందించారు. అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం సాగరతీరాన కొలువు తీరింది.
తాత్విక జ్జానిగా ఆయన: తాను ఊహించిన దానికన్నా అత్యద్భుతంగా విగ్రహం, రూపం ఆవిష్కృతమైందని.. ప్రసన్నవదనంతో నిలుచుని ఉన్న అంబేద్కరుడు ఓ తాత్విక జ్జానిగా అలరిస్తున్నారని సీఎం కేసీఆర్ అంటున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని చెబుతున్నారు. అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర సచివాలయానికి కూడా ఆయన పెట్టుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుడి విగ్రహం, మరోదిక్కు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్థూపం... వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్ మహానుభావుడు మనలను నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్ఫూర్తివంతమై దారి చూపుతాడన్నది సీఎం కేసీఆర్ అభిప్రాయం.
అతిథిగా ముని మనవడు: అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈరోజు సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబేడ్కర్ మునిమనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బౌద్ధ భిక్షువుల ప్రార్థనల మధ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. విగ్రహావిష్కరణతో పాటు సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగేలా భారీ క్రేన్ సాయంతో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.
ఇవీ చదవండి: