Ambedkar Death Anniversary in telangana: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. దేశానికి అంబేడ్కర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలంటూ కొందరు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ కృషిని గుర్తుచేసుకున్న కిషన్‌రెడ్డి.. రాజ్యాంగం మార్చాలంటూ కేసీఆర్ కూడా మాట్లాడారన్నారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగానికి కట్టుబడే మోదీ సర్కార్ దేశంలో పాలన సాగిస్తోందని తెలిపారు.
అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జబ్బర్ కాంప్లెక్స్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేడ్కర్ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.
అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి జగదీశ్‌రెడ్డి నివాళులర్పించారు. అన్నివర్గాల ప్రజల ఐక్యత, హక్కులకు నిదర్శనం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అని పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తి, ఆలోచన, ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని జగదీశ్‌రెడ్డి కొనియాడారు. పంజాగుట్టలో గతంలో అంబేడ్కర్ విగ్రహం కూల్చివేసి.. ఇప్పటికీ ఏర్పాటు చేయలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ట్యాంక్‌బండ్‌పై మౌనదీక్ష చేపట్టారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాతకు నివాళి అర్పించిన ఆయన... కేసీఆర్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌కు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుంది.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల... ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో ఉన్న చిత్తశుద్ధి చేతల్లో కనపడడం లేదని విమర్శించారు. కేసీఆర్ చేసిన వాగ్ధానాలు నెరవేర్చడానికి రాజ్యాంగం అడ్డు వచ్చిందా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: