రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం సహా 18 మంది మంత్రులు ఉండవచ్చు. అంటే ఇంకా 16 ఖాళీలున్నాయి. ఈ నెల 19న చేపట్టబోయే విస్తరణలో 8 నుంచి 10 మందికి చోటు దక్కుతుందని సీఎం చూచాయగా చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కించుకొనున్న ఎమ్మెల్యేలకు 18న అర్ధరాత్రి దాటాక సమాచారం ఇవ్వనున్నారు.
గత ప్రభుత్వంలో మంత్రిపదవి ఆశించి నిరాశ చెందిన వారు ఈ మారు తమకు అవకాశం లభిస్తుందని ఆశగా ఉన్నారు. జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు ఉండనుంది. ఈసారి మహిళలకు మంత్రివర్గంలో తప్పకుండా చోటు ఉంటుందని భావిస్తున్నారు. ఉపసభాపతిగా పనిచేసిన పద్మాదేవేందర్ రెడ్డి మహిళా కోటా రేసులో ముందున్నారనే చెప్పుకోవచ్చు. ఎస్టీ కోణంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, రెడ్యానాయక్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కడియం శ్రీహరిల విషయంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కేటీఆర్‌కు ఈ దఫా కేబినెట్లో చోటు ఉంటుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఎర్రబెల్లి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు మంత్రివర్గంలో చోటు ఖాయమని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారితో పాటు, శ్రీనివాస్ గౌడ్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పువ్వాడ అజయ్, గొంగిడి సునీత తదితరులు కూడా మంత్రిపదవులపై ఆశలు పెట్టుకున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
మంత్రివర్గంలో చోటు కల్పించలేని వారికి శాసనసభ ఉపసభాపతి, చీఫ్ విప్, విప్‌లు, పార్లమెంటరీ కార్యదర్శులుగా అవకాశం కల్పించనున్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా సీఎం కేసీఆర్ పదవుల పంపకం చేపట్టనున్నారు.