Budget for South Central Railway 2023 : దేశంలో ఇతర జోన్లతో పోల్చుకుంటే దక్షిణ మధ్య రైల్వేకు భారీగా ఆదాయం వస్తోంది. ప్రయాణికులతోపాటు సరుకు రవాణా ద్వారా రాబడి సమకూరుతోంది. ఐనా బడ్జెట్ కేటాయింపులో మాత్రం ప్రాధాన్యం అంతంత మాత్రమే. దక్షిణ మధ్య జోన్ నుంచి రైల్వేశాఖకు గతేడాది 14 వేల2 వందల 66 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికే రూ. 13 వేల 7వందల 87 కోట్లు గడించింది. ఇంకో రూ.4 వేల కోట్లు రావొచ్చని అంచనా.
South Central Railway Budget 2023 : రాష్ట్రానికి గతేడాది బడ్జెట్‌లో కేవలం 3వేల కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు. దేశ రైల్వే నెట్ వర్క్‌లో రాష్ట్ర వాటా 3 శాతానికి మించి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సింగిల్ లైన్ల వాటానే 57 శాతం ఉంది. డబుల్ లైన్లు కేవలం 710 కిలోమీటర్ల వరకే ఉన్నాయి. ట్రిపుల్ లైన్లు వంద కిలోమీటర్ల లోపే ఉన్నాయి.
"కోటిపల్లి - నరసాపూర్ 2000-01 సంవత్సరంలో బడ్జెట్‌లో దీనికి ఆమోదం తెలపడం జరిగింది. మునీరబాద్- మహబూబ్‌నగర్ కడప -బెంగుళూరు భద్రచలం -సత్తిపల్లి ఇవన్నీ కొత్త ప్రాజెక్టులు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికి నత్తనడకనే పనులు సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడం లేదు."-భరణి, రైల్వే ఉద్యోగ సంఘం నేత
సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. అనుకున్న సమయంలో పూర్తిచేయాలంటే ఈ బడ్జెట్‌లో కనీసం రూ.300 కోట్లయినా మంజూరు చేయాలి. కాజీపేట పీరీయాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్‌కు రూ. 200 కోట్లు కేటాయిస్తేనే పనులు జరుగుతాయి. హైదరాబాద్-కరీంనగర్‌ను అనుసంధానించే మనోహరాబాద్-కొత్తపల్లి మార్గానికి ఈసారైనా భారీగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
Pending projects on South Central Railway line: ఘట్‌కేసర్-రాయగిరి ఎమ్‌ఎమ్‌టీఎస్ నాలుగేళ్లుగా పైసా విదల్చడం లేదు. బీబీనగర్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ, ఏపీలోని నల్లపాడు వరకు సింగిల్ లైనే ఉంది. డబుల్ లైన్ సర్వే పూర్తై ఏడాది దాటింది. కాజీపేట-హుజురాబాద్-కరీంనగర్, ఘన్‌పూర్-సూర్యాపేట, ఆదిలాబాద్-నిర్మల్, ఆర్మూర్, పటాన్ చెరువు-సంగారెడ్డి-మెదక్ ప్రతిపాదిత లైన్లను మంజూరు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. రామగుండం-మణుగూరు కొత్త లైనుకు రైల్వే బోర్డు సూత్రప్రాయ ఆమోదం లభించింది.
సూర్యాపేట మీదుగా హైదరాబాద్-విజయవాడ రైల్వే లైన్ డిమాండ్ దశాబ్దకాలంగా వినిపిస్తుంది. బడ్జెట్‌లో మోక్షం లభిస్తే 60కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఏటా బడ్జెట్‌కు ముందు ఎంపీలతో చేపట్టే సమావేశాన్ని.. దక్షిణ మధ్య రైల్వేశాఖ ఈసారి నిర్వహించలేదు. ఎన్నికల ఏడాది బడ్జెట్‌లోనైనా దక్షిణ మధ్య రైల్వేకు నిధులిచ్చి రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులు మంజూరు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.
"ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను సాధరణ బడ్జెట్‌లో కలపడంతో తెలంగాణకు చిన్నచూపు చూస్తోంది. చాలా మంది ఎమ్‌ఎమ్‌టీఎస్ సేవలు వినియోగించుకుంటున్నారు. కానీ వాటిపై దృష్టి పెట్టకుండా వేరే ట్రైన్స్‌పై దృష్టిసారిస్తున్నారు".-కే.వీ.ఆర్ ప్రసాద్, రైల్వే ఉద్యోగసంఘం నేత
ఇవీ చదవండి: