తెలంగాణలో పాలిటెక్నిక్ (Polytechnic) కోర్సుల్లో మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. మొదటి విడతలో 84.38 శాతం సీట్లు భర్తీ కాగా... మరో 4,471 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలోని 120 పాలిటెక్నిక్ కళాశాలల్లో 28,627 సీట్లు ఉండగా.. 24,156 సీట్లను కేటాయించారు. ప్రభుత్వ కళాశాలల్లో 11,704 సీట్లు ఉండగా.. 11,551 సీట్ల కేటాయింపు పూర్తయింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 16,696 సీట్లకుగాను 12,378 సీట్లను కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, 13 ప్రైవేట్ కాలేజీల్లో మొదటి విడతలోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో బోధనా రుసుము చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
ఈనెల 23న తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని నవీన్ మిత్తల్ తెలిపారు. 23న స్లాట్ బుకింగ్, 24న ధ్రువపత్రాల పరిశీలన, 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. 27న తుది విడత సీట్ల కేటాయింపు.. సెప్టెంబరు 1న పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. సెప్టెంబరు 1 నుంచి 4 వరకు ఓరియంటేషన్ నిర్వహించి.. 6న తరగతులు ప్రారంభించనున్నట్లు నవీన్ మిత్తల్ వివరించారు.
ఎంసెట్ ఫార్మా, వ్యవసాయ పరీక్ష 'కీ' విడుదల
ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ప్రాథమిక సమాధానాలు, రెస్పాన్స్ షీట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలతో పాటు.. ప్రాథమిక కీని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ప్రాథమిక సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 16వ తేదీ సాయంత్రం 4 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని కన్వీనర్ పేర్కొన్నారు. ఈనెల 9, 10వ తేదీల్లో ఫార్మా, వ్యవసాయ కోర్సుల కోసం ఎంసెట్ నిర్వహించారు.
ఇదీ చూడండి:
Jagtial News : రాత్రంతా శవానికి పూజలు.. ఇక బతికిరాడని చివరికి ఏం చేశారో తెలుసా