అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి.. పోడు రైతుల భూ హక్కులను కాపాడాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. వామపక్షాలు, ఇతర పార్టీలు ఎవరికి వారుగా ఉద్యమాలు చేస్తున్నామని.. ఇప్పుడు ఐక్యంగా 'పోడురైతు పోరాట కమిటీ'గా పోరాడతామని నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పోడుభూముల సమస్యపై ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష నేతలు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. ఈ మేరకు ఈ నెల 13న హైదరాబాద్‌లో పోడు హక్కుల పొలికేక సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. పోడు సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అక్టోబర్ 5న పెద్ద ఎత్తున రాస్తారోకో చేపడతామని పేర్కొన్నారు.
'పోడు రైతుల భూ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. అందరం కలిసి పోడు రైతు పోరాట కమిటీగా ఏర్పడ్డాం. అటవీ హక్కుల చట్టం (పెసా)ను అమలు చేసి.. పోడు రైతుల భూమి హక్కులను కాపాడాలి అనేదే ఈ కమిటీ ప్రధాన డిమాండ్. ఇందుకోసం కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్‌లో ఈ నెల 13న పోడురైతు పొలికేక సదస్సు నిర్వహిస్తాం. తర్వాత అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాం. అక్టోబర్ 5న పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించాలని నిర్ణయించాం.' - కోదండరాం, తెజస అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పోడు రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కంపా నిధుల కోసం అటవీశాఖ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి.. పోడు రైతులపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు రైతుల హక్కుల కోసం సీపీఐ ప్రత్యక్షంగా పోరాడుతుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, గిరిజన వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి.. బలవంతంగా భూములు లాక్కుంటున్నారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. పోడు భూములపై అందరం కలిసి పోరాడతామని అన్నారు.
ఇదీ చూడండి: Rain Effect: చేపలకు బదులు కోళ్లు కొట్టుకొచ్చాయి.. ఆ గ్రామస్థులకు పండగే పండగ...