భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కలిసికట్టుగా పోరాటం చేయాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట సర్కిల్ వద్ద పెట్టనీయకుండా అడ్డుకుని రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు (Vh) నేతృత్వంలో ఇవాళ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన అఖిలపక్ష సమవేశానికి పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. భాజపా, తెరాసకు చెందిన నాయకులు మినహా అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు.
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని మూడో అధికరణం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని అక్కడ పెట్టనీయకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు (Vh) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతికి, జయంతికి కూడా బయటకు రాడని... ఆయనపై గౌరవం లేకపోవడం చూపకపోవడం తప్పు కాదా అని ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతనే కాదు... ఆయన ఒక వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. విగ్రహ ఏర్పాటుకు హనుమంతురావు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... ఆయనతో కలిసి పోరాటం చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: Yadadri Temple: అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు ఖర్చు... మరో 200 కోట్లు అవసరం!