హైదరాబాద్ సింగరేణికాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. చిన్నారిపై అఘాయిత్యం జరగడం బాధాకరమని తెజస అధ్యక్షుడు కోదండ రాం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలని ఆయన కోరారు. చిన్నారి ఘటనపై ప్రతి ఒక్కరి మనసు క్షోభిస్తుందని కోదండ రాం అన్నారు.
సింగరేణి కాలనీలో చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య జరిగిన స్థలాన్ని కోదండ రాంతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ నేత మల్లు రవి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని పెంచాలని కోదండ రాం డిమాండ్ చేశారు. నగరంలో విస్తరిస్తున్న గంజాయి వ్యాపారాన్ని నియంత్రించాలని సూచించారు. బాధిత కుటుంబానికి దళిత బంధు మాదిరిగా రూ. 10లక్షల ఆర్థిక సహాయంతో పాటు భూమి ఇవ్వాలని మల్లు రవి, తమ్మినేని వీరభద్రం కోరారు.
చిన్నారిపై హత్యాచారం ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. అతడిని కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి అరకొర సహాయం కాకుండా.. భద్రత ఉన్న ఉద్యోగం, దళిత బంధు మాదిరిగా రూ. 10లక్షలు, భూమి ఇవ్వాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -అఖిల పక్ష నేతలు
ఇదీ చదవండి: Hyderabad girl rape: సైదాబాద్ బాలిక హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు