హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన అప్పలనాయుడు ఫోన్‌కు ఈ నెల 11న ఒక మెసేజ్ వచ్చింది. మరో 24 గంటల్లో మీ సిమ్ కార్డు బ్లాక్ అవుతుంది. మీరు వెంటనే ‘ఈ- కేవైసీ’ ( ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) అప్‌డేట్ చేయాలి.... లేకపోతే సిమ్ కార్డు బ్లాక్ అవుతుందనేది ఈ సందేశం యొక్క సారాంశం. సందేశం వచ్చిన కాసేపటికే ఓ వ్యక్తి ఫోన్ చేసి తనకు తాను ఎయిర్టెల్ కస్టమర్ కేర్ ప్రతినిధిగా నమ్మబలికాడు. ఒక మెయిల్ పంపించి దాన్ని #121కు పంపాలసిందిగా కోరాడు. వినియోగదారుడి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆ తర్వాత వెంటనే ఈ-సిమ్ కార్డు అందిస్తామని అవతలి వ్యక్తి బుకాయించాడు.
ఈ-సిమ్ కార్డు పేరుతో లక్షల్లో మోసం...
అతడి మాటలు నమ్మిన అప్పలనాయుడు ఈ- సిమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఎయిర్టెల్ నుంచి ఆయన చరవాణికి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశాన్ని కూడా సైబర్ మోసగాడికి చేరవేశాడు. దీనివల్ల బాధితుని ఎయిర్‌టెల్ ఫోన్ నెంబర్‌కు నేరగాడి ఈ-మెయిల్ జత అయింది. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి సైబర్ నేరగాడు గూగుల్ వ్యూ ఫామ్ పంపించి అందులో బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాల్సిందిగా సూచించాడు. ఆ మేరకు బాధితుడు తన ఖాతా వివరాలు నమోదు చేశాడు. ఖాతా వివరాలు ఈ-సిమ్ కార్డు సేకరించిన సైబర్ నేరగాడు ఆయన ఖాతాల నుంచి వెంటనే తొమ్మిది లక్షలకు పైగా నగదును డ్రా చేసుకున్నాడు. గచ్చిబౌలికి చెందిన కిషోర్ మిశ్రాకు ఈ నెల 10వ తేదీన ఇలాంటి సందేహమే వచ్చింది. ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి సుమారు ఆరు లక్షలు పోగొట్టుకున్నాడు. అలాగే సురేష్ అనే మరో వ్యక్తి కూడా 2 రోజుల క్రితం ఈ తరహాలోనే లక్ష రూపాయలు మోసపోయాడు.
ఈ తరహా మోసాలు క్రమంగా పెరుగుతుండం వల్ల సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే గంపగుత్త సందేశాలను నమ్మొద్దని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు లింకులు పంపిస్తే వాటిని ఓపెన్ చేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.