ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధప్రాతిపాదికన విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇస్తామన్న వరద సాయం ఏ కారణం చేత ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. 2020 అక్టోబరు నాటి వరద బాధితులు.. దాదాపు 5 లక్షమంది నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో కేటీఆర్ చెప్పాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా దాదాపు 200కోట్ల రూపాయిల నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేశారన్నారు. ఈ పరిహారాన్ని ఎప్పుడు చెల్లిస్తారని దాసోజు నిలదీశారు. నాళాలు వెడల్పు, స్ట్రాటజిక్ నాళా డెవలప్‌మెంట్‌ని ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేసి వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుతారని కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.
పలు ప్రాంతాల్లో మళ్లీ వరదలు
గత వర్షకాలంలో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయి. వరదల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కాని జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ రావటంతో అది నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత పరిహారం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. కాని కొంత మందికి ఇప్పటికీ సాయం అందలేదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత సంవత్సరం లాగానే పలు ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి.
ఇదీ చదవండి: Hyderabad Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం