లాక్‌డౌన్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్... కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే చర్యలన్నింటికీ తమ పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని స్పష్టం చేశారు.
లాక్డౌన్ పొడిగింపు వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి పూర్తిగా ఛిద్రమయ్యే ప్రమాదం ఉందని శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలు మరీ ప్రమాదంలో పడ్డారని... వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో అమలు తీరులో లోపాలు ఉన్నాయని...వాటికి తక్షణ పరిష్కార మార్గం చూపాలని విన్నవించారు.
రబీ సీజన్‌లో వివిధ పంటలు...53.68 లక్షల ఎకరాల్లో సాగయ్యాయని వివరించారు. మొక్కజొన్న 6.21 లక్షల ఎకరాలు, శనగ 3.28 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైనట్లు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున సాగైన పంటలు నేలపాలు, వ్యాపారులపాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర అమలయ్యేట్లు...చర్యలు తీసుకోవాలని కోరారు.