Dasoju on KCR: రాష్ట్రంలోని 15 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. రైతుల పక్షాన కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన వెల్లడించారు. మొత్తం సాగు భూమిలో 70 శాతం సాగు కౌలు రైతుల చేతిలోనే ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మాట్లాడారు.
వరంగల్ రైతుల డిక్లరేషన్‌లోని 9 అంశాలను జనంలోకి తీసుకెళ్లి రైతుల్లో భరోసా కల్పిస్తున్నట్లు దాసోజు శ్రవణ్ వివరించారు. రాష్ట్రంలో 12 ఏళ్ల పిల్లాడిని అడిగినా వరంగల్ డిక్లరేషన్ గురించి చెప్పేట్లుగా ప్రచారం చేస్తూ రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే కేవలం 31 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే కొన్నారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం తుగ్లక్ పాలన చేస్తోందని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై ఉన్న ఆసక్తి రాష్ట్ర రైతులపై లేదు. రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షలకు గాను కేవలం 31 లక్షల టన్నుల వడ్లే కొన్నారు. రాష్ట్ర రైతులను ఆదుకోవడానికి కేసీఆర్‌కు మనసు రావడం లేదు. ప్రజలు ఎక్కడికక్కడ తెరాస నేతలను నిలదీయాలి. మన సొమ్ముతో పంజాబ్ రైతులను ఆదుకుంటారు.. మరి ఇక్కడ ఆదుకోరా?. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్‌లు లేవు. కౌలు రైతులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. రైతు కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి గిరిజన రైతుకు, పోడు రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలి.
- దాసోజు శ్రవణ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి
తెలంగాణ రైతులను ఆదుకోవడానికి కేసీఆర్‌కు మనసు రావడం లేదని దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాష్ట్రంలో 8 వేల మంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటే వెయ్యి మందిని మాత్రమే గుర్తించారని ఆరోపించారు. పోడు భూములను హరితహారం పేరుతో గుంజుకొని హక్కు పత్రాలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను ఏ ఒక్కదానిని కూడా పూర్తి చేయలేదన్న ఆయన ఈ మోసాలను రచ్చబండ కార్యక్రమాలల్లో ఎండగడతామని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. దానిని ఎవరూ అడ్డుకోలేరు'
Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడురోజులపాటు మోస్తరు వర్షాలు
'ఆప్' సర్కార్ మరో కీలక నిర్ణయం.. 424 మంది వీఐపీలకు భద్రత కట్!