అఖిల పక్ష సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వ భూముల అమ్మకంపై నిర్ణయం ఏలా తీసుకుంటారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ విడుదల చేసిన జీవోను అమలు చేస్తామని 2015లో చెప్పిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుందని నిలదీశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ ట్రస్టీ మాత్రమేనని వారికి భూములమ్మే హక్కు లేదని ఆయన విమర్శించారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న తెరాస సర్కార్ తప్పుడు పనులు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకోడానికి ఆర్థిక నిపుణులు లేకుండా సమావేశాలు పెడితే ప్రయోజనం ఉండదని విమర్శించారు. ఆదాయ వనరుల సమీకరణ కోసం భూములు అమ్మొద్దని.. ఇదో పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఆనాడు భూములు అమ్మాలన్నప్పుడు..కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం తీసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకున్నట్లు దాసోజు వివరించారు. ఏడేళ్ల తెరాస పాలనలో ఒక్కసారి కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు.