విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు తమ సమస్యల సాధన కోసం ఐక్యంగా పోరాటం చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే ముఖ్యమంత్రికి ప్రజలు గుర్తుకొస్తారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫర్నిచర్ హబ్ జ్యూవెలరీ పార్క్ తెలంగాణ విశ్వకర్మలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిర్వహించిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఫర్నీచర్ హబ్ జ్యూవెలరీ పార్కుల ఏర్పాటులో విశ్వకర్మలు సమైక్యంగా కీలక పాత్ర పోషించాలని అందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తామని దాసోజు శ్రవణ్ అన్నారు.
విశ్వకర్మబంధు అమలు చేయాలి
రాష్ట్ర బడ్జెట్లో విశ్వకర్మలకు ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. విశ్వకర్మబంధు ప్రకటించకపోతే హుజూరాబాద్‌లో తెరాసను ఓడిస్తామన్నారు. కుల సంఘాల ఐక్యతను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. తాము దళిత బంధును వ్యతిరేకించడం లేదన్నారు. రాష్ట్రంలోని అనేక బలహీన వర్గాలు, బీసీ కులాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సహకారం అందించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల అధ్యక్షుడు కుందారం గణేశ్, రాష్ట్ర సంఘం ప్రతినిధులు పి.రంగాచారి, వి.నరసింహాచారి, దుబ్బాక కిషన్ రావు, రామోజు బాల నరసింహ, మారోజు వినోద్ కుమార్, ఆర్.వెంకటరమణ, సీహెచ్ జలంధరా, పెద్దపల్లి పురుషోత్తం, సంతోశ్ కుమార్ పాల్గొన్నారు.
మనమందరం కలిసి కలిసికట్టుగా పోరాడుతాం. అందరి పోరాట స్ఫూర్తితో మనం పోరాడాలి. ప్రజలను కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తున్నారు. -దాసోజు శ్రవణ్ కుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి
మేం పన్నులు కడితేనే రాష్ట్ర బడ్జెట్ లక్షల కోట్లు వచ్చేది. విశ్వబ్రాహ్మణులకు బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించలేదు. దళితబంధులాగే ఇప్పుడు విశ్వకర్మ బంధు కూడా ఇవ్వాల్సిందే. లేని పక్షంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, నిజమాబాద్‌లో పెద్దసంఖ్యలో ఉన్న విశ్వబ్రాహ్మణులంతా కలిసి మిమ్మల్ని ఓడిస్తాం. - జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
ఇదీ చూడండి: Revanth Reddy: 'కేసీఆర్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం... భాజపా సహకరించాలి'