దాయాది దేశమైన పాకిస్థాన్ జమ్మూ కశ్మీర్, గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్ క్రీక్‌లను తమ భూభాగంలో కలిపేసుకోవడం, నియంత్రణ రేఖను కారాకోరం పాస్ వరకు పొడిగించుకోవడం, సియాచిన్‌ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా చూపిండంపై ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
చైనా అండ చూసుకునే పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కొత్త మ్యాప్ ఆవిష్కరించి.. ఆ దేశ కేబినెట్ ఆమోద ముద్ర వేయించడాన్ని ఖండించారు. ఇటీవల నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేసి, అక్కడి పార్లమెంట్ ఆమోదం పొందిన తరహాలో పాకిస్తాన్ కూడా ఇలా చేయడం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఇందిరా గాంధీ హయాంలో మన దేశం వైపు పాకిస్థాన్ కన్నెత్తి చూడలేదన్నారు.
మొన్న చైనా, నిన్న నేపాల్, నేడు పాకిస్థాన్... ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో భారతదేశ భద్రతకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడంలో ఉన్న శ్రద్ధ, భారత భూబాగాన్ని కాపాడుకోవడంలో లేదని ఆరోపించారు.
ఇదీ చూడండి:- ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు