ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను కాంగ్రెస్ పార్టీ అభినందించింది. ఈ మేరకు రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, కార్డుకు రూ.1500 అందిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ప్రశంసించారు.
ప్రభుత్వం కుటుంబానికి ఇవ్వనున్న రూ.1500 నగదు పెరిగిన ధరల దృష్ట్యా సరిపోదని.. దానిని పెంచాలని సంపత్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద కూలీలు పని చేయకపోయినా డబ్బులు చెల్లించేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణంగా సహకరిస్తామని వివరించారు.