రోజుకో నిరుద్యోగి పిట్టల్లా రాలిపోతుంటే కనీస మానవత్వం లేకుండా కేసీఆర్ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గోదావరి నదిలో మునిగి చనిపోయిన వారికి సంతాపం ప్రకటించిన కేసీఆర్‌కి.. సునీల్ నాయక్ చావు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఉద్యోగం కోసం ప్రాణాలు విడిచిపెట్టిన ఓ లంబాడి బిడ్డ చావు కనిపించలేదా అని నిలదీశారు. సునీల్ నాయక్ చితి ఆరకముందే మరో తెలంగాణ బిడ్డ నిరుద్యోగంతో ప్రాణం విడిచాడని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ కారుడు మహేందర్ యాదవ్ అనేక మార్లు పోలీసుల తూటాలు, లాఠీలకు ఎదురు నిలబడి కొట్లాడిన యువకుడని కొనియాడారు. బీటెక్ చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నించి, నిరుద్యోగల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ వైఖరితో విసుగు చెంది.. నిరాశతో ఆత్మహత్య చేసుకుని లోకం విడిచాడని ఆరోపించారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి కరోనా కారణంగా ప్రైవేట్ టీచర్ ఉద్యోగం కోల్పోయాడని..‘’నలుగురు పిల్లలతో ఇబ్బంది పడుతున్నా ఆదుకోవాలని’ అంటూ వీడియో విడుదల చేసినా ఒక్కరు కూడా స్పందించిన పాపానికి పోలేదన్నారు.
ఇదీ చూడండి : నేటి నుంచి ఉపాధ్యాయులకు ఒంటిపూట విధులు