AI Usage in Telangana Election Campaign 2023 : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో అభ్యర్థులు.. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ అధినాయకుల వరకు అచితూచి అడుగులేస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే కొంతమంది మాత్రం ఇలా ప్రచారానికి లక్షలు ఖర్చు చేయలేక వెనకడుగు వేస్తున్నారు. వారి కోసమే ఏఐ వచ్చేసింది. కాస్త తెలివిగా ఆలోచిస్తున్న అభ్యర్థులు ప్రచారంలో.. ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)ను వినియోగిస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా..? ఇలా రండి దాని సంగతేంటో తెలుసుకుందాం.
Telangana Election Campaign in Social Media : ఇప్పటికే ఎన్నికల్లో కొన్ని పార్టీలు సోషల్ మీడియా ద్వారా వెరైటీ స్లోగన్స్‌తో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఊళ్లలో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతి ఓటరును సామాజిక మాధ్యమాల వేదికగా ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమకే ఓటేయాలంటూ..పాటలు రూపొందిస్తూ.. గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాయి. నేరుగా ఓటర్ల ఫోన్లకు వాయిస్ మెసేజ్ రూపంలో కాల్స్‌చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థుల అభ్యర్థిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. వివిధ పథకాల లబ్ధిదారులుగా ఉంటున్న వారికి కూడా ఈ తరహా కాల్స్ చేసి ఓట్లు వేయాలని కోరుతున్నారు.
Social Media Election Campaign in Telangana : గ్రేటర్‌లో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 2.5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. అన్ని కాలనీలు, బస్తీలు తిరుగుతూ ఓటర్లను కలవడం వీలుకాదు. బహిరంగ సభలు ఎన్ని పెట్టినా ఇంకా తిరగని ప్రాంతాలు చాలానే ఉంటాయి. దీంతో జూబ్లీహిల్స్ నుంచి ఓ స్వతంత్ర అభ్యర్థి తన ప్రచారంలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఏఐ టూల్‌ను తయారు చేయించి ఆ నియోజకవర్గంలోని ఓటర్ల వాట్సాప్ నంబర్లకు ఓ లింక్‌ను పంపుతున్నారు. అది ఓపెన్ చేసి చూస్తే.. అభ్యర్థి పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దాంట్లోనే మెసేజ్ ద్వారా అభ్యర్థికి పలు ప్రశ్నలు వేసే అవకాశం ఉంది.
మిషన్ లెర్నింగ్‌తో ముందే కొన్ని ప్రశ్నలకు జవాబులు తయారు చేసి అందులో ఉంచారు. దీంతో ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేస్తుంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొందరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్ట పడుతుంటారు. అయితే రాజకీయ నేపథ్యం, డబ్బు లేకపోవడంతో పోటీ చేయరు. ఏఐ సాంకేతికతతో అతి తక్కువ ఖర్చుతో ప్రచారం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ద్వారా ఒక్కో ఓటర్‌కు సమాచారం పంపడానికి 80 పైసలు పడుతుంది. భవిష్యత్తులో ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ప్రచార ఖర్చులు తగ్గించుకోవడానికి.. ఇదో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.