Minister Niranjan Reddy's Review on Monsoon Crop: ఈ ఏడాది వానాకాలం సమాయత్తం దృష్ట్యా నకిలీ విత్తన పంపిణీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ కార్యకలాపాలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వానా కాలంలో పంటల సాగు, విస్తీర్ణం, విత్తనాలు, రసాయన ఎరువుల సేకరణ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.
రైతులను మరింత ప్రోత్సహించాలి: ఈ సందర్భంగా 2023 - 24 వానా కాలంలో కోటీ 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని అంచనా వేసినట్లు తెలిపారు. మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్న కారణంగా వ్యవసాయ శాఖ సమాయత్తం కావాలని ఆదేశించారు. పత్తి, కంది సాగు రైతులను మరింత ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఎకరానికి రూ.40 వేలు పంట రుణం అందించాలి: సేంద్రీయ సాగు, భూసారం దృష్టిలో పెట్టుకుని పచ్చి రొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని, అందుకోసం ఇప్పటికే రూ.76.66 కోట్లు కేటాయించామని మంత్రి గుర్తు చేశారు. పర్యావరణహితం కోసం నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వాడకం ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ అవసరాల్లో డ్రోన్ వినియోగంపై యువతకు అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయిల్‌ఫాం సాగులో అంతర పంటల సాగు కోసం డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేల వరకు పంట రుణాలు అందించాలని ఆదేశించారు.
యాసంగి పంట వచ్చే ఏడాది మార్చికి పూర్తి అవ్వాలి: ఈ వర్షాకాలంలో మొత్తం విస్తీర్ణంలో పంట వేయకుండా వచ్చే యాసంగిలోనే వరి సాగు కోసం నారు మళ్లకు అవసరమయ్యే భూమిని వదులుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుంచి నష్టాన్ని నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. తక్కువ కాలంలో అధిక దిగుబడులు ఇచ్చే నూతన వరి వంగడాలు రైతులకు అందేలా చూడాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమీక్షలో ఎవరెవరు పాల్గొన్నారంటే..: ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, మార గంగారెడ్డి, కొండూరు రవీందర్‌రావు, సాయిచంద్, తిప్పన విజయసింహారెడ్డి, మచ్చా శ్రీనివాసరావు, రాజా వరప్రసాదరావు, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సచివాలయంలో తొలిసారి వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: