సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయాలు రెట్టింపు లక్ష్యంగా రాబోయే రోజుల్లో వ్యవసాయ పంటల సాగు సరళి మరింతగా మారాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ జనార్దన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సీడ్ రీసెర్చ్, టెక్నాలజీ సెంటర్ - ఎస్‌ఆర్‌టీసీని జనార్దన్‌రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకుపలతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, సీడ్ రీసెర్చ్ టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఎస్‌ఆర్‌టీసీలో ప్రయోగాత్మకంగా అధిక సాంద్రత విధానంలో సాగు చేస్తున్న పత్తి పంట క్షేత్రాలను విస్తృతంగా పరిశీలించారు. ఈ రకంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు ద్వారా అతి తక్కువ యాజమాన్య పద్ధతులు అవలంభించడంవల్ల అధిక ఉత్పత్తి, ఉత్పాదకత లభిస్తాయని వీసీ వివరించారు.
అనంతరం చిరుధాన్యాల ఆహారోత్పత్తుల తయారీ కేంద్రాన్ని జనార్దన్‌రెడ్డి సందర్శించారు. ఆ కేంద్రంలో తయారవుతున్న చిరుధాన్యాల ప్రొసెసింగ్, అదనపు విలువ జోడింపు, ఆహారోత్పత్తుల విధానం, తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధకశక్తి పెంపొందించుకోవాలంటే చిరుధాన్యాల ఉత్పత్తుల వినియోగంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కార్యదర్శి సూచించారు.