కృష్ణా జల వివాదంపై అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించేందుకు నాలుగు అంశాలను అజెండాగా నిర్ణయించినట్లు తెలిసింది. కరోనా కారణంగా సమావేశం ఇప్పుడిప్పుడే జరిగే అవకాశం లేదని నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అధికారులు మాత్రం అజెండా ఖరారు పనిలో ఉన్నారు. అజెండాలో అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా జల్‌శక్తి అధికారుల సూచన మేరకు కృష్ణా బోర్డు నుంచి కొంత సమాచారం వెళ్లినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలపడానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. గత ఆరేళ్లలో ఇప్పటివరకు ఒకసారే కౌన్సిల్ సమావేశం జరిగింది. రెండో సమావేశానికి ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది.
అజెండాలో చేర్చిన అంశాలివి!
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పర్యవేక్షణకు బోర్డును నియమించినా ఇప్పటివరకు పరిధి ఖరారు కాలేదు. దీనిపై చర్చలు, సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ అంశాన్ని అజెండాలో చేర్చినట్లు తెలిసింది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకొనేలా తాత్కాలిక ఒప్పందం జరిగింది. ప్రతి సంవత్సరం దీనినే పొడిగిస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు అంశం ట్రైబ్యునల్ వద్ద విచారణలో ఉంది. అలాగే పోలవరం నిర్మాణం ద్వారా గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో వాటా విషయాన్ని కూడా చేర్చినట్లు సమాచారం. గోదావరి నుంచి కృష్ణాలోకి 80 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. ఇందులో కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు వెళ్తాయి. మిగిలిన 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకోవాలని ఉంది. నాగార్జునసాగర్ ఎగువన కృష్ణా బేసిన్‌లో ఉన్నవి తెలంగాణ ప్రాజెక్టులు కాబట్టి తమకే కేటాయించాలని తెలంగాణ కోరుతుండగా, ఆంధ్రప్రదేశ్ అంగీకరించలేదు. కేంద్రం నిపుణుల కమిటీని నియమించినా నీటి వాటాలు తేల్చాల్చింది ట్రైబ్యునల్ తప్ప కమిటీలు కాదంటూ ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి నివేదిక ఇవ్వకుండానే కమిటీ పని ముగిసింది.
ముఖ్యమంత్రులు ఆసక్తి చూపుతారా?
గోదావరి వరద నీటిని కృష్ణాలోకి మళ్లించడంపై ఇప్పటికే సమావేశమై చర్చించిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్‌లో ఇవే అంశాలపై చర్చకు ఆసక్తి చూపుతారా లేదా అన్నది కేంద్ర జల్‌శక్తి మంత్రి సమావేశం తేదీని ఖరారు చేసిన తర్వాతనే తేలనుంది.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!