కరోనా లాక్డౌన్ ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. కొంత మందికి తినడానికి తిండి లేకుండా చేసింది. మరికొంత మందికి ఉపాధిని దూరం చేసింది. అందులో ఒకరు.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వన్‌టౌన్‌లోని కొత్తపేట కోమలావిలాస్ సెంటర్లో కిల్లీ బడ్డి నిర్వహకుడు. రెండు నెలల క్రితం లాక్ డౌన్ ప్రకటించడంతో కిల్లీ బడ్డీని మూసేశాడు. ఆ తర్వాత లాక్డౌన్ పెంచుకుంటూ రావడంతో బడ్డీని తెరవలేదు. ప్రస్తుతం సడలింపులు ఇవ్వడంతో బడ్డీని తెరిచి చూసి ఒక్కసారి ఖంగు తిన్నాడు.
విజయవాడ వన్‌టౌన్‌లోని కొత్తపేట కోమలావిలాస్ సెంటర్లో కిల్లీ బడ్డి నిర్వహకుడు రెండు నెలల తర్వాత తన దుకాణాన్ని తెరిచి చూడగా ఒక్కసారిగా లోపలి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు దుమ్ము, బూజు పట్టిపోయిన బల్లలు, కుర్చీతోపాటు ఇతర వస్తువుల్నీ చూసి నివ్వెరపోయాడు. ఇన్ని రోజులుగా దుకాణం తెరవకపోవడంతో అందులోని వస్తువులన్నీ ఎందుకు పనికిరాకుండా తయారయ్యాయి. కరెన్సీ నోట్లను చెదపురుగులు తినేయడంతో నోట్లు పనికి రాకుండా పోయాయి. కాగితం చేతిలోకి తీసుకుంటే పూర్తిగా పొడిపొడి అవుతుండటంతో దుకాణ నిర్వాహకునికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా విజయవాడలోని ఈ ప్రాంతం రెడ్‌జోన్‌లో ఉండడం... చిన్నదుకాణాలు తెరిచేందుకు అనుమతించని పరిస్థితుల్లో రోజుల తరబడి తమ దుకాణాలు మూతపడే ఉన్నాయని... ఇప్పుడు సడలింపులతో తాళాలు తీసిచూస్తే లోపలి వాతావరణం కన్నీళ్లు తెప్పించిందని దుకాణ నిర్వాహకుడు పేర్కొన్నాడు. పూర్తిగా లాక్డౌన్ సడలించిన తర్వాత చాలా దుకాణాల్లో ఇంతకు మించిన దారుణ పరిస్థితులే కనిపిస్తాయనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: భారత హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ ఇకలేరు