టీఎస్‌ఆర్టీసీలో మిగులు సిబ్బందిని వివిధ విధుల్లో సర్దుబాటు చేస్తున్నారు. విద్యార్హత ఉన్న కండక్టర్లకు ప్రత్యేక పరీక్షలు పెట్టి.. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన కార్గో సేవలకు వినియోగించుకుంటే.. మిగతావారిని గుమస్తా, పెయింటర్, మెకానిక్, శ్రామిక్ ఇలా వివిధ విధుల్లో అవకాశం కల్పించారు. ఈ మేరకు అన్ని డిపోల్లోని నోటీసు బోర్డుల్లో పెట్టి.. వారి ఇష్టం మేరకు విధులను అప్పజెప్పారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగానికి ఎసరు లేకుండా వేరే విధుల్లో చేరడం శ్రేయస్కరమని భావించిన డ్రైవర్లు, కండక్టర్లు వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ పరిణామాలను కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ విధానాన్ని తప్పు పట్టింది.
ఇష్టమైన వారు చేరాలని కోరితే..
ఇంకా 10 ఏళ్ల సర్వీసు ఉంది.. ఇలాంటి తరుణంలో బస్సులు తగ్గిపోయాయి. మాకు వేరే గత్యంతరం లేదు. డిపో మేనేజర్ స్థాయిలో అప్పజెప్పిన పనులు నిర్వహిస్తున్నామని ఓ డిపోకు చెందిన డ్రైవర్ పేర్కొన్నారు. ఇలాగే చాలామంది సర్దుబాటు అయ్యారు. నోటీసు బోర్డులో అన్ని వివరాలు పెట్టాం.. ఇష్టమైన వారు.. విధుల్లో చేరండని కోరితే.. చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు ఇష్టపూర్వకంగానే వేర్వేరు విధుల్లో జాయిన్ అయ్యారని ఆ డ్రైవర్ తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..
డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు క్లాస్-3లో ఉండగా ప్రస్తుత నియామకాలు క్లాస్-4లో ఉన్నాయని టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తోంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడాన్ని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఖండించారు. రూ. 10 వేలతో జరిగే పనిని కండక్టర్, డ్రైవర్లతో చేయించడాన్ని తప్పుపట్టారు.
ఇవీ చూడండి: 'కంటోన్మెట్ అభివృద్ధికి ప్రతినెలా రూ.10కోట్లు'