రాష్ట్రంలో రైతులు ప్రత్యేకంగా సాగుచేస్తున్న పంటలకు ‘భౌగోళిక సూచిక’(జీఐ) గుర్తింపు పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలోనే ప్రత్యేకంగా పండే ‘చపాటా’ మిరప, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో పండే మామిడి రకానికి జీఐ సూచిక కోసం ‘భారత వ్యవసాయ పరిశోధనా మండలి’(ఐసీఏఆర్)కి దరఖాస్తు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వివరాల సేకరణ ప్రారంభించింది. ఇప్పటికే వికారాబాద్ జిల్లా తాండూరులో పండే కందిపప్పునకు సైతం ఇదే గుర్తింపు కోసం దరఖాస్తు చేశారు. వచ్చే నెలలోగా దీనికి గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ కందిపప్పునకు ధ్రువీకరణ పత్రం వచ్చాక చపాటా మిరప, మామిడికి దరఖాస్తులు పంపాలని కసరత్తులు చేస్తున్నారు.
సుగుణాలున్న మిరప పంట...
కొంత ప్రాంతానికే ఈ సుగుణాలున్న పంట పండుతున్నందున జీఐ సూచిక పొందడానికి దీనికి అర్హత ఉందని జయశంకర్ వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ చెప్పారు. అలాగే ఎన్నో ప్రత్యేక గుణాలు, తియ్యని రుచి కలిగిన కొల్లాపూర్ మామిడి వంగడానికి సైతం జీఐ సూచిక పొందడానికి అర్హతలున్నాయని ఆయన వివరించారు. దీని వివరాలు సైతం శాస్త్రీయంగా సేకరిస్తున్నట్లు తెలిపారు. తాండూరు కందిపప్పునకు త్వరలో చపాటా మిరప, కొల్లాపూర్ మామిడికి సైతం జీఐ గుర్తింపు పొంది జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ బ్రాండుతో వాటి అమ్మకాలు పెంచితే రైతులకు ఆదాయం అధికమవుతుందని ఆయన చెప్పారు.
ఎందుకు ప్రత్యేకం...
కొంచెం లావుగా, ముడతలు పడి కనిపించే చపాటా రకం ఎండు మిరపకాయల్లో పెద్దగా కారం ఉండదు. దీన్ని వరంగల్ జిల్లా వాసులు ‘స్వీట్ మిర్చి’ అని పిలుస్తారు. వీటికి విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జిల్లాలోని నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామంలో 1978 ప్రాంతంలో కొందరు రైతులు దీని విత్తనాలను స్థానికంగానే అభివృద్ధి చేసి ప్రయోగాత్మకంగా సాగుచేశారు. ఆ తరవాత దీనిని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేయడానికి జాతీయ, అంతర్జాతీయ వ్యాపారులూ కొనడం ప్రారంభించడంతో మార్కెట్‌లో అధిక ధరలు వచ్చాయి. గతంలో ఒకసారి రికార్డుస్థాయిలో క్వింటా రూ.25 వేలకు సైతం అమ్మారు. ములుగు జిల్లా ఏటూరునాగారం, జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలాల్లో సైతం దీనిని పండిస్తారు. నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పండిన ఈ విత్తనాలను వేరేచోట వేస్తే ప్రత్యేక సుగుణాలు రావడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇదీ చదవండి: Huzurabad By Election Campaign: పదునెక్కిన ప్రచారం... నువ్వానేనా అంటోన్న తెరాస, భాజపా