చింతలకుంటలో గత నెల 16న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు సుందర్‌లాల్‌ను రిమాండ్‌కు తరలించారు. వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ మీడియాకు వివరించారు.
మహారాష్ట్రకు చెందిన సుందర్‌లాల్‌కు వివాహమైంది. ఆయనకు భార్యతోపాటు ఓ కూతురు ఉంది. ఈక్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సీమతో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమపేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. సుందర్ లాల్ వివాహమైన విషయాన్ని సీమకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి వనస్థలిపురంలో కాపురం పెట్టాడు. మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
సుందర్ లాల్‌ను స్వగ్రామానికి తీసుకెళ్లాలని సీమ తరచూ అడుగుతోంది. సొంతూరికి వెళితే.. తనకు పెళ్లైన విషయం బయట పడుతుందని సుందర్లాల్ భావించాడు. ఎప్పటికైనా విషయం బయటికి వస్తుందని భావించిన సుందర్లాల్... సీమను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పధకం ప్రకారం గత నెల 16వ తేదీన వాసవి శ్రీ నిలయంలోని మూడంతస్తుల భవనం పైనుంచి తోసేసి హత్య చేసి, పారిపోయాడు.
మృతురాలి బంధువుల ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లా హన్మకొండలో తలదాచుకున్న సుందర్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసును ఛేదించిన పోలీసులకు డీసీపీ రివార్డులు అందించారు. గత నెల 5వ తేదీన మధ్యప్రదేశ్లోని పోలీస్‌స్టేషన్‌లో సీమ మిస్సింగ్ కేసు నమోదైంది.
ఇవీ చూడండి: పెళ్లి మండపంలో ముష్టియుద్ధం