పాట్నాకు చెందిన పార్శీనాథ్‌సింగ్ ముఠా 20 ఏళ్ల క్రితం ఈ ఘరానా నేరానికి పాల్పడింది. ముఠా సభ్యులు ఇచ్చిన లంచం తీసుకుని వారికి సహకరించారంటూ సీఐడీ అధికారులు సంగారెడ్డి ఉపఖజానా అధికారులపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘకాలం విచారించిన ఏసీబీ కోర్టు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.లక్ష్మీమనోజ్ఞ వాదనలు, నిందితుల తరఫు వాదనలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధించింది.
మిలటరీ అధికారులమంటూ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం అలహాబాద్‌లోని పింఛన్ చెల్లింపుల ప్రధాన కార్యాలయం ద్వారా సొమ్మును సికింద్రాబాద్‌కు పంపుతుంది. అక్కడి నుంచి ఆయా జిల్లాల ఖజానా, ఉపఖజానా కార్యాలయాలకు ఆ సొమ్ము వెళ్లేది. ప్రక్రియలో లొసుగులను గుర్తించిన పార్శీనాథ్ ఏడుగురు నేరస్థులతో కలిసి పింఛన్ సొమ్మును కొల్లగొట్టేందుకు పథకం రచించాడు. మిలటరీ అధికారులమంటూ నమ్మబలికి సికింద్రాబాద్‌లోని పింఛన్ చెల్లింపుల కార్యాలయం నుంచి పింఛన్‌దారుల వివరాలు సేకరించాడు.
పది జిల్లాలు.. రూ.2కోట్లు
పార్శీనాథ్ ముఠా సభ్యులకు నకిలీ చిరునామాలు, సైన్యంలో పనిచేసినట్టు గుర్తింపు కార్డులు తయారుచేశాడు. మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్, గుంటూరు, చిత్తూరు, నిజామాబాద్, కర్నూలు, కడప, అనంతపురం, కరీంనగర్ జిల్లాలను ఏడు నెలల వ్యవధిలోనే చుట్టేశారు. మొత్తంగా రూ.2కోట్ల నగదు కొల్లగొట్టారు. పార్శీనాథ్ కరీంనగర్‌లో పింఛన్ సొమ్ము తీసుకుంటుండగా జిల్లా ఖజానా అధికారులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతగాడు అరెస్టయ్యాకే రూ.రెండు కోట్లు కొల్లగొట్టిన విషయం బహిర్గతమైంది.
అధికారులపై కేసులు
పింఛన్ కుంభకోణం పది జిల్లాల్లో ఉండటం వల్ల అప్పటి ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రతి జిల్లాలోనూ ఖజానా కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు పార్శీనాథ్ ముఠా లంచం ఇచ్చి పింఛన్ సొమ్మును తీసుకున్నట్లు సీఐడీ ఆధారాలు సేకరించారు. పార్శీనాథ్ ఇచ్చిన సమాచారంతో బిహార్‌కు వెళ్లగా ఏడుగురిలో శంభునాథ్ పాండే మాత్రమే దొరికాడు. అనంతరం ఈ కుంభకోణంలో నిందితులుగా ఆయా జిల్లాల్లో అప్పుడు విధులు నిర్వహించిన ప్రభుత్వ అధికారులను చేర్చారు. సంగారెడ్డి ఉపఖజానా అధికారులపై నమోదైన కేసు విచారణ పూర్తికావడంతో ఏసీబీ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
ఇదీ చూడండి: టెక్ కేంద్రంగా ఓరుగల్లు: మంత్రి కేటీఆర్