అనిశాకు చిక్కిన అవినీతి చేప అనిశా అధికారులకు న్యాయ సలహాదారుడు నేరుగా పట్టుబడ్డాడు. హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారుడిగా పని చేస్తున్న గుండ్లపల్లి సత్యనారాయణ లక్షా 60వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఉప్పల్ సాయిరామ్‌కాలనీకి చెందిన శ్యామ్‌కుమార్‌కు 250 గజాల స్థలంలో భవనం ఉంది. కొన్ని ఏళ్ల నుంచి ఇంటి పన్ను తన తండ్రి పేరిట వస్తోంది. తన పేరు మీద వచ్చే విధంగా మార్చాలని ఈఏడాది జనవరిలో జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
రెవెన్యూ విభాగం అధికారులు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారుడు సత్యనారాయణను కలవాలని సూచించారు. లక్షా 70 వేల రూపాయలు ఇస్తే పని పూర్తి అవుతుందని దరఖాస్తు దారుడికి చెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక శ్యామ్ అనిశా అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు కొత్తపేటలో శ్యామ్‌కుమార్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా సత్యనారాయణ నేరుగాపట్టుబడ్డాడు.
అనిశా అధికారులు సత్యనారాయణపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: 'ఎమ్మెల్సీల్లో తెరాస ఎత్తులు'