విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు శాసనసభ ముట్టడికి యత్నించారు.50 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగా అసెంబ్లీ3వ గేటు వద్ద ప్రత్యక్షమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు ఏబీవీపీ విద్యార్థులు నిలువరించి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది.
ఒకవైపు విద్యార్థులను అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తుండగా మరికొందరు విద్యార్థులు దూసుకురావడం వల్ల పోలీసులకు నిలువరించడం కష్టసాధ్యంగా మారింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి.
రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు 9 నెలలుగా వైస్‌ఛాన్స్‌లర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని... వెంటనే వీసీలను నియమించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని యూనివర్సిటీలలోతోపాటు డిగ్రీ ,జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు.. లక్ష ఏడువేల ఖాళీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.
సెంట్రల్ సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున శాంతి భద్రత, టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అరెస్టు చేశారు. కొంతమంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురి కావడం వల్ల మంచి నీళ్లు తాపి ఆ తర్వాత వారిని కూడా పోలీసు వాహనాల్లో ఎక్కించి తరలించారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస