Chakali Ailamma Jayanti: రజాకార్ల, పెత్తందార్ల అకృత్యాలు, అఘాయిత్యాలకు ఎదురొడ్డి ఎందరో అమరులయ్యారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రాణాలర్పించి వీర యోధులుగా చరిత్రలో నిలిచిపోయారు. 75 ఏళ్లయినా ఆ పోరాటయోధుల ధైర్యం, తెగువ, త్యాగనిరతి ఎప్పటికీ మర్చిపోలేం. వెట్టిచాకిరీ విముక్తి కోసం కొంగుబిగించి ఉద్యమంలోకి దూకి భూస్వాములకు వణుకు పుట్టించింది వీరనారీ చాకలి ఐలమ్మ. 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో చాకలి ఐలమ్మ జన్మించారు. వివాహం చేసుకొని పాలకుర్తికి వచ్చిన ఆమె వేల ఎకరాల అధిపతిగా ఉన్న దొర దోపిడినీ ధైర్యంగా ఎదురించి ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
కులవృత్తితో కుటుంబ గడవడం కష్టమై.. వ్యవసాయం చేద్దామని కొంతభూమి కౌలుకు తీసుకోవడం విస్నూరు దేశ్‌ముఖ్.. రామచంద్రారెడ్డి దొరకు కంటగింపుగా మారింది. దీంతో ఐలమ్మను చిత్రవధకు గురి చేశాడు. ఎదురించిన ఐలమ్మ గడీకి వచ్చి పని చేసేది లేదని ధైర్యంగాచెప్పగా కౌలు చేసుకుంటున్నభూమిని రామచంద్రాెడ్డి లాక్కున్నాడు. ఆ భూమి తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని పంపిస్తే వారిపై కాళికలా తిరుగబడింది. ఐలమ్మ ఇంటిని తగలబెట్టిస్తే కొంగు బిగించి రోకలి బండను చేతపట్టి ఉద్యమించింది. రైతులు కూలీలను ఏకం చేసింది.
బాంచెన్ నీ కాల్‌మెక్కుతా అన్న జనంచేత బంధూకులు పట్టించి సాయుధ పోరాటంలో ఓ అగ్నికణంలా మారిన ఐలమ్మ.. 1985 సెప్టెంబర్ 10న అమరురాలైంది. ఐలమ్మ భూపోరాటం మొదలుకొని సాయుధ పోరాటం చివరివరకూ 4 వేలమంది అసువులు బాస్తేగానీ.. ఈ గడ్డకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు దక్కలేదు. ఈ వీరనారీమణి వీరోచిత పోరు. నాడు, నేడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
ఇవీ చదవండి: