రాష్ట్రంలోని ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ తరుణంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 53 ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులు రద్దు కానున్నాయి.
రెండేళ్ల లోపు శిక్ష ఉండే కేసులు, చెక్‌బౌన్స్ వివాదాలను పరిష్కరించేందుకు పదేళ్ల క్రితం ప్రత్యేక మెజిస్టేట్ కోర్టులు ఏర్పాటయ్యాయి. విశ్రాంత న్యాయాధికారుల నేతృత్వంలోని ఇవి పనిచేస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇటీవల 15 శాశ్వత కోర్టులు ఏర్పాటు కావడంతో.. ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. విశ్రాంత న్యాయాధికారుల సేవలు నిలిపి వేయాలని తెలిపింది. ప్రత్యేక కోర్టుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులను ఇతర కోర్టుల్లో తాత్కాలిక ప్రాతిపదికన వినియోగించుకోవాలని జిల్లా జడ్జిలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి : రేపు నాగార్జునసాగర్ అభ్యర్థిని ప్రకటించనున్న తెరాస!