A young man molested a minor girl at Borabanda Hyderabad : రోజురోజుకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామాంధులు వావి వరసలు మరచి.. చిన్నా, పెద్దా తేడా లేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు లేదా మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. చట్టాలు, పోలీసుల చర్యలు, కఠిన శిక్షలు.. ఇవేవీ ఈ దారుణాలను ఆపలేకపోతున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఓ మైనర్ ఇలాంటి దారుణ ఘటనే ఎదుర్కొని నరకాన్ని చవి చూసింది. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో అసలు బాగోతం బయటకువచ్చింది.
తెలిసీ తెలియని వయసు.. ఎదిగీ ఎదగని మనసు.. అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఇంటర్నెట్.. కొత్త కొత్త వ్యక్తులను, సరికొత్త కోరికలను పరిచయం చేసే సాంకేతిక టెక్నాలజీ యుగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నా.. నేరగాళ్ల ప్రవృత్తి మారడం లేదు. రోజురోజుకూ మీతిమీరుతున్న వీరి ఆగడాలను భరించలేని అమాయక ఆడపిల్లలు, మహిళలు వారి బారినపడి తమ జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు. హైదరాబాద్లో గతేడాది ఓ మైనర్ అత్యాచారానికి గురై.. ఏం చేయాలో తెలియక తలవంచుకొని తాళి కట్టించుకుంది. ప్రేమించానంటూ వెంటబడి మరీ వివాహం చేసుకున్న ఆ యువకుడు ఆమెకు ఏడాది వ్యవధిలోనే నరకం చవిచూపాడు. తనపై కోపం చల్లారక కన్నబిడ్డను కాటికి పంపే ప్రయత్నం చేశాడు ఆ దుర్మార్గుడు. నగరంలోని బోరబండ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంటకు చెందిన బి.సాయిప్రణీత్(19) మూడేళ్ల క్రితం నగరానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమించమంటూ వెంటపడ్డాడు. అలా రోజూ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ వేధించడం మొదలుపెట్టాడు. తనకు ఇష్టం లేదంటూ నిరాకరిస్తూ వచ్చింది ఆ బాలిక. దాంతో పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తుండగా బలవంతంగా ఎత్తుకెళ్లి యాదగిరిగుట్టలో వివాహమాడాడు. పెళ్లి చేసుకున్న అనంతరం బోరబండ ప్రాంతానికి వచ్చి కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత కొద్దికాలం సరూర్‌నగర్ చేరి గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో గంజాయి, మద్యానికి అలవాటుపడిన యువకుడు బాలికను శారీరకంగా, మానసికంగా వేధించటం ప్రారంభించాడు. గతేడాది డిసెంబరులో బాలికకు బాబు పుట్టాక మరింతగా రెచ్చిపోయాడు.
బోరబండలో బంధువులు ఉండటంతో మకాం మళ్లీ ఇక్కడకు మార్చాడు. గంజాయి మత్తులో గత నెల 4న అతడు చిన్నారిని నేలకేసి కొట్టడంతో తలకు గాయమైంది. బాలిక ఫిర్యాదు చేసేందుకు పలు ఠాణాలకు తిరిగినా.. ఫలితం లేకుండాపోయింది. సరిహద్దులు తమవి కావంటూ వెనక్కి పంపారు. విషయం దక్షిణ మండలం డీసీపీ జోయల్ డేవిస్ దృష్టికి రావటంతో బాధితురాలి ఫిర్యాదు తీసుకోవాలని బోరబండ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి :