తెలంగాణలో రెండో యూకే వైరస్ కేసు నిర్ధారణయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓ మహిళకు ఈ వైరస్ సోకినట్టు సీసీఎంబీ నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఈ సమాచారాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి వరంగల్ వాసిలో కొత్త వైరస్ ఉన్నట్టు నిర్ధారణకాగా, తాజా ఫలితంతో రెండో కేసు నమోదైనట్లయింది.
ఈ నేపథ్యంలో పాజిటివ్ వ్యక్తుల సన్నిహితులను గుర్తించడంపై తెలంగాణ ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. సాధారణంగా కొవిడ్ సోకిన వ్యక్తులు 10 రోజుల వరకూ ఐసొలేషన్‌లో ఉండాల్సి ఉండగా, కొత్త వైరస్ సోకిన వ్యక్తుల్లో ఎటువంటి లక్షణాలు లేకపోయినా 14 రోజులపాటు ఆసుపత్రి ఐసొలేషన్‌లో ఉండాలని స్పష్టంచేసింది. రెండుసార్లు కొవిడ్ నెగెటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాతే ఆ వ్యక్తిని ఇంటికి పంపుతామని తెలిపింది.
'యూకే ప్రయాణికుల సన్నిహితులను కనుగొనడానికి పోలీసు, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల సహకారాన్నీ తీసుకుంటున్నాం. ప్రధానంగా కుటుంబ సభ్యులు, వారి ఇళ్లలోని పనిమనుషులు, డ్రైవర్లు తదితరులను గుర్తించడంపై దృష్టిపెట్టాం. ఈ వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందే స్వభావం ఉన్నందున సాధ్యమైనంత త్వరగా కాంటాక్టు వ్యక్తులను గుర్తించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీచేశామని' వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. యూకే ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన బాధితులకు చికిత్స అందించడం కోసం ఇప్పటికే టిమ్స్‌లో మూడంతస్తులను కేటాయించారు. రాష్ట్రంలోని ఇతర ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచారు.