ఆశ్వయుజ అష్టమి లేదా దుర్గాష్టమినే సద్దుల బతుకమ్మ అంటారు. పెత్రమాసతో మొదలైన నవరాత్రులు నేటితో ముగుస్తాయి. ఆశ్వయుజ మాసంలో ఎనిమిదో రోజైన దుర్గాష్టమి నాడు బతుకమ్మను 'సద్దుల బతుకమ్మ'గా జరుపుకుంటారు. దీన్ని 'పెద్ద బతుకమ్మ' అని కూడా పిలుస్తారు. తంగేడు, బంతి, చామంతి, గునుగు, సీతజడ, కలువ, గడ్డుపూలు వంటి తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఇవాళ తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ.. ఇలా రెండు బతుకమ్మలను పేర్చి.. హోరెత్తే ఉయ్యాల పాటలతో మహిళలంతా ఎంతో వైభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఉద్యోగం, పెళ్లి, చదువు పేరుతో ఇంటికి దూరంగా ఉన్న ఆడబిడ్డలంతా ఇళ్లకు చేరుతారు. తీరొక్క పూలతో బతుకమ్మలు, ఆడబిడ్డల పట్టువస్త్రాలు, ఆభరణాల ధగధగలు, పసుపు, కుంకుమతో తెలంగాణలోని ప్రతిగడపకు కొత్త కళ వస్తుందంటే అతిశయోక్తికాదు.
మురిసిన తెలంగాణ లోగిళ్లు
తీరొక్క పూలతో ఊరూవాడా లోగిళ్లన్నీ వూలవనాలుగా ఆవిష్కృతమవుతాయి. వేకువజామునే అందరూ నిద్రలేస్తారు. పురుషులు సంచులు తీసుకొని పూలవేట కోసం పచ్చిక బయళ్లకు వెళ్తారు. పూలు సేకరించడానికి పిల్లలూ పెద్దలతో కలిసి పచ్చికబయళ్లకు వెళ్తారు. ఈ సమయంలో ప్రతి చెట్టు ఆ గౌరమ్మ సిగలో వాలడానికే వికసించినట్లుగా పూలతో పలకరిస్తాయి. వేకువజామునే నిద్రలేచిన మహిళలు... పిండి వంటలు ప్రారంభిస్తారు. ఇంటిళ్లిపాది ఉదయాన్నే తలస్నానాలు చేసి... నూతన వస్త్రాలు ధరిస్తారు. అలా ఇంట్లోని ఓ ప్రదేశంలో చాప పరుస్తారు. పచ్చికబయళ్ల నుంచి తీసుకొచ్చిన పూలతో బతుకమ్మను పేర్చుతారు. నచ్చిన సైజులో వలయాకారంలో ఉన్న తాంబాలం లేదా ప్లేట్లను తీసుకుంటారు. అందులో ఓ ఆకు పరిచి... పసుపు పచ్చని తంగేడు, తెల్లని గునుగు, ఎర్రటి మందారం మొదలు తీరొక్క పూలతో సింగిడిలోని రంగుల కలబోతగా బతుకమ్మను తయారు చేస్తారు. రంగులు మార్చుతూ... వలయాకారంలో వివిధ వర్ణాల్లో తీర్చిదిద్దుతారు. మధ్యలో పూల రేకలు, ఆకులు వంటివి నింపుతూ అందంగా పేరుస్తారు. అనంతరం పూజ గదిలో భద్రంగా ఉంచి... పసుపుతో గౌరమ్మను తయారు చేస్తారు. అగరుబత్తిలు వెలిగిస్తారు.
గౌరమ్మకు నైవేద్యాలు
తంగేడు, గునుగు, టేకు, చేమంతి, బంతి, తామర, కలువ, కట్ల పూలు, నందివర్ధనం, గడ్డిపూలు ఇలా తీరొక్క పూలతో సింగిడి రంగుల కలబోతగా బతుకమ్మను శిఖరంలాగా పేరుస్తారు. ఓ తెల్లని వస్త్రం తీసుకొచ్చి... పసుపు రాస్తారు. ఆ వస్త్రంలో పసుపు కలిపిన ఒడిబియ్యం ఉంచుతారు. సద్దుల బతుకమ్మనాడు సద్దులు కడుతారు. అనగా ఐదు రకాల నైవేద్యాలను నివేదిస్తారు. పులిహోర, పెరుగన్నం, కొబ్బరన్నం, నువ్వలన్నం, మలీద మద్దులను తయారు చేస్తారు.
భూదేవీ పులకించేలా..
మహిళలంతా భక్తిశ్రద్ధలతో అందంగా ఆ బతుకమ్మను పేర్చే సమయానికల్లా సాయంత్రం అవుతుంది. బతుకమ్మను పేర్చి... ఇక పిల్లాపెద్దలు ఇనుప సందుగల్లో ఉన్న పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరిస్తారు. ఆ చల్లటి సాయంత్రం వేళ తీరొక్క పూలతో పేర్చిన ఆ బతుకమ్మను విశాలమైన ప్రదేశంలో ఉంచి కోలాటాలు చేస్తారు. అనంతరం దేవాలయ ప్రాంగణం లేదా చెరువువైపు గానీ, తటాకంవైపుగానీ బయల్దేరుతారు. సింగిడిలోని రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఊరేగింపుగా వస్తున్న ఆ ఆడబిడ్డలను చూస్తే రెండు కళ్లు సరిపోవు. ఈ అద్భత దశ్యాన్ని చూడడం కోసం పండు ముసలమ్మ సైతం వీధుల్లోకి వచ్చి నిలబడతారంటే అతిశయోక్తి కాదు. భూదేవీ పులకించేలా ఈ బతుకమ్మల జోరు ఉంటుంది. రంగురంగుల పూలు... అగరుబత్తుల వాసనలు... ఆడబిడ్డల పట్టు చీరల మెరుపులు... ఆభరణాల ధగధగలు.. అచ్చమైన ఈ పల్లెపండుగ తెలంగాణ అస్తిత్వానికే ప్రతీక.
ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ..
విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు, అనుబంధాలు, కష్టసుఖాలను తెలియజేసే పాటలు పాడుతారు. పిల్లాపెద్దా కలిసి ఐక్యతా, సోదరభావం, ప్రేమానురాగాలతో జరుపుకుంటారు. ఈ క్రమంలో వరుసైనవాళ్లు కాసేపు ఆటలాడుకుంటారు.
పోయిరా గౌరమ్మా.. పోయిరావమ్మా..
ఎక్కడెక్కడో ఉండే ఆడబిడ్డలంతా సొంతూరికి చేరుతారు. పుట్టిన ఊరిలోని తమ చిన్ననాటి మిత్రులతో కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ప్రస్తుతం డీజే పాటలతో బతుకమ్మల వద్ద అందరూ సందడి చేస్తున్నారు. అనంతరం పురుషులు వచ్చి ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. పోయిరా గౌరమ్మా... పోయిరావమ్మా.. అంటూ సాగనంపుతారు. అనంతరం తమతో తీసుకొచ్చిన సద్దులను ఆ గౌరమ్మకు సమర్పించి... ఒకరికొకరు పంచుకుంటారు. ఖాళీ తాంబాలంతో పాటలు పాడుతూ ఇళ్లకు చేరుతారు. దాదాపు అర్ధరాత్రి వరకు ఇలా పాటలు పాడుతూ... కోలాటాలు చేస్తారు. చివరిరోజైన సద్దుల బతుకమ్మ నాడు ఈ వేడుకలు మనోహరంగా జరుగుతాయి.
ప్రతిబిడ్డకూ అపురూపమే..
ఆరోగ్యం, ఐకమత్యం, భగవతారాదనతో కూడిన బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులపాటు జరుపుకునే పూల పండుగ. ఏటా తొమ్మిది రోజులపాటు తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో పండుగ సందడి ఉంటుంది. చదువులు, ఉద్యోగాల పేరిట దూరంగా ఉంటున్న పిల్లలు సొంతగూటికి చేరుతారు. అత్తారింట్లో ఉండే మహిళలూ పిల్లాపాపలతో పుట్టింటికి చేరుతారు. మెట్టినింట్లో ఎన్నో కట్టుబాట్ల నడుమ ఉండే మహిళ అయినా... సరే బతుకమ్మ పండుగ నాడు చిన్ననాటి స్నేహితులతో చప్పట్లు, కోలాటాలతో పసిపిల్లల్లాగా మారిపోతుంది. ప్రాణధారణకు ఆధారమైన నేలలో, నీటిలో ప్రభవించే బతుకు పువ్వే బతుకమ్మ. మానవ జీవనంలోని సుఖదుఃఖాలకు, స్నేహానురాగాలకు, ఆప్యాయతాదరణలకు ప్రతీకలైన రంగురంగుల పూలతోనే బతుకు తల్లికి పూజ. అచ్చమైన పల్లెపండుగ. ప్రకృతి పండుగ. అద్భుతమైన సంప్రదాయం. ఈ పండుగలో మహిళలే మహారాణులు. వారిదే హడావిడి అంతా! అందుకే మరి... ఏటా వచ్చే ఈ పండుగ ప్రతిఆడబిడ్డకు అపురూపమే. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఈటీవీ భారత్ తరఫున సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
ఇదీ చదవండి: engili pula bathukamma 2021: సింగిడిలోని రంగులు.. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ.. అచ్చమైన ప్రకృతి పండుగ