హైదరాబాద్‌కు చెందిన ఐ.శ్రీనివాసరావు ఓ బ్యాంకులో ఉన్నతోద్యోగి. కరోనా బారిన పడి కోలుకొని విధులకు హాజరవుతున్నారు. ఆయనకు తెలిసిన ఓ వైద్యుడికీ కరోనా సోకింది. సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్లిష్టంగా మారటంతో ప్లాస్మా థెరపీ చేయాలని వైద్యులు సూచించారు.
శ్రీనివాస్‌రావుకు ఈ విషయం తెలిసి తాను దానమిస్తానని, కిమ్స్ వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు ప్లాస్మా తీసుకోవటానికి అంగీకరించారు. ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడిన వైద్యుడికే ప్రాణాల మీదకు రావడం.. తానున్నానంటూ ముందుకొచ్చిన శ్రీనివాస్‌రావు ప్రశంసలందుకున్నారు.
ఒక్క శ్రీనివాసరావే కాదు.. ఎందరో కరోనాను జయించారు. చాలామంది ప్లాస్మా దానానికి అర్హులయినా, అపోహల వల్ల ముందుకు రావడం లేదని వైద్యులు అంటున్నారు.
అతి తక్కువ మందే ముందుకొస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోనే 100 మంది వరకు కరోనా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. పలువురు ప్లాస్మా థెరపీతో కోలుకునే అవకాశం ఉన్నా దాతలు లేక ప్రత్యామ్నాయ చికిత్సలు చేస్తున్నారు.
ఎలాంటి భయాలొద్దు
కరోనా నుంచి కోలుకున్న తరవాత 17-30 రోజుల్లో శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఇలాంటి వారి ప్లాస్మాలోని యాంటీబాడీలను తీసి, పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితులకు ఎక్కిస్తారు. తద్వారా వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి కోలుకుంటారు.
పరీక్షలు చేసి అన్నీ సక్రమంగా ఉన్న వారి రక్తం నుంచి ప్లాస్మా ఒక్కటే సేకరిస్తారు. ఒకసారి కొవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ దాని బారిన పడటం చాలా తక్కువ. కొవిడ్ నుంచి కోలుకున్న వారు నిర్భయంగా ప్లాస్మా దానం చేయొచ్చు. ఏ ఇబ్బందీ ఉండదు.
- రక్తపోటు నియంత్రణలో ఉన్నవారు, మాత్రల ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంచుకున్న వారు ప్లాస్మా దానానికి అర్హులు. గర్భిణులు అర్హులు కాదు.
- కరోనా బారిన పడిన ప్రతి పది మందిలో ఆరుగురు ఇప్పటికే కోలుకున్నారు. వీరిలో ఒకరిద్దరు ముందుకొచ్చినా.. ఎంతోమందికి మేలు జరుగుతుంది.
- ప్లాస్మా దాతకు కొవిడ్ యాంటీ బాడీ టెస్టు, హిమోగ్లోబిన్ టెస్టు తదితర పరీక్షలు నిర్వహిస్తారు. సంతృప్తికర ఫలితాలు వచ్చాకే ప్లాస్మా తీసుకుంటారు.
- రక్తం సేకరించాక ప్లాస్మా వేరు చేయడం సరికాదు. యంత్రం ద్వారా నేరుగా సేకరించిన ప్లాస్మా మాత్రమే రోగులకు ఎక్కించి, రక్తాన్ని తిరిగి దాత శరీరంలోకి పంపించాలి.
-డాక్టర్ హితేష్‌కుమార్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ కన్సల్టెంట్, కిమ్స్
ఇదీ చదవండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు