కడుపున పుట్టిన పిల్లలు పాల కోసం కొట్టుకుంటున్నప్పుడు వారించిన తల్లి... ఇప్పుడు తన పేరుపై ఉన్న ఆస్తి కోసం ఆమెనే కొడుతుంటే కన్నీరు పెట్టుకుంటుంది. ఐశ్వర్యాలు ఇవ్వొద్దు కాసిని గంజినీళ్లు పోయండయ్యా అంటూ ఇద్దరి కొడుకులనూ వేడుకుంది. ఆస్తి లాక్కొని ఒకరు కొట్టి గెంటేస్తే... ఆ ఆస్తి తీసుకున్న వాడిదగ్గరకే వెళ్లిపొమ్మంటూ ఇంకో కొడుకు బయటకు నెట్టేశాడంటూ ఆ తల్లి పోలీసులను ఆశ్రయించిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన వృద్ధురాలు దేవమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కూతుళ్లు పెళ్లయి వెళ్లిపోయినప్పటి నుంచి చిన్న కొడుకుతో కలిసి ఉండేది. ఈ క్రమంలో తల్లి పేరుపై ఉన్న ఎకరంన్నర భూమిని పెద్ద కొడుకు అంజయ్య రాయించుకున్నాడు. విషయం తెలుసుకున్న చిన్న కొడుకు రాము తనకూ భూమి కావాలని తల్లిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయం పెద్దకొడుకు దగ్గర ప్రస్తావించగా నీవు చనిపోయిన తర్వాత ఇస్తానంటూ తనని కొట్టి నెట్టేశాడంటూ తల్లి రోదిస్తుంది. పెద్ద కొడుకు భూమి తీసుకుంటే నేనేందుకు నీకు అన్నం పెట్టాలంటూ ఇంటి నుంచి చిన్న కొడుకు గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి తనకు న్యాయం చేయాలంటూ పటాన్చెరు పోలీసులను ఆశ్రయించింది. వృద్ధాప్యంలో ఉన్న తనకు కాస్త నీడనిచ్చి గంజీనీళ్లు పోయండని వేడుకుంటుంది.