మసీదుకు చెందిన స్థలాన్ని కబ్జా చేశారనే విషయాన్ని బయట పెట్టినందుకు తనపై దాడి చేశారని హైదరాబాద్‌లోని కింగ్ కోఠికి చెందిన అలీ బగ్దాదీ ఆరోపించారు. ఈ మేరకు తనకు ప్రాణహాని ఉందని.. రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ విషయంపై నారాయణ గూడ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనని పోలీసులు అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని వీడియో ద్వారా తన ఆవేదనను తెలియపరిచారు.
కబ్జాకు గురైన విషయాన్ని వెలికి తీసినందుకే కింగ్ కోఠిలోని 'జుడి మసీదు'కు చెందిన స్థలాన్ని స్థానికంగా పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తులు ఆక్రమించారని వీడియోలో అలీ వివరించారు. కబ్జా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ వాహనాలను పార్కింగ్ చేస్తోందని.. ఈ పార్కింగ్ చేసినందుకు ప్రతి నెలా రూ. 15 వేలు కబ్జా చేసిన వారికి ఏజెన్సీ చెల్లిస్తోందని చెప్పారు.
ఫోన్ల ద్వారా వేధింపులు
మసీదుకు చెందిన పెద్దలు పలుమార్లు ఈ విషయంపై జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు, నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారని అలీ వివరించారు. జీహెచ్ఎంసీ, పోలీసులు ఎవరూ ఫిర్యాదును పట్టించుకోలేదని.. ఈ క్రమంలో స్థలం కబ్జా చేసిన వారు ఈ నెల 22న రాత్రి 8 గంటల సమయంలో తన ఇంటికి వచ్చి దాడికి యత్నించారని తెలిపారు. వెంటనే పోలీసులకు తెలిపానని... వారు ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారని పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారు పలు నంబర్లతో ఫోన్లు చేసి తనను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తనకు రక్షణ కల్పించాలని అలీ బగ్దాదీ వాట్సప్ ద్వారా మీడియాను కోరారు.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదాల నివారణపై అన్వేషణ