వర్షా కాలం వచ్చిందంటే చాలు... నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏ చెరువు, నాలా పొంగి తమ ప్రాణాల మీదకు వస్తుందోనని వణికిపోతున్నారు. రెండు రోజుల క్రితం వరద నాలాలో బాలిక పడి కొట్టుకుపోగా... తాజాగా సరూర్‌నగర్ తపోవన్ కాలనీలో వరద నీటిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ రెండు ఘటనలు భద్రతను ప్రశ్నార్ధకం చేశాయి. నేరేడ్‌మెట్ ప్రాంతంలో సుమేధా అనే బాలిక సైకిల్ పై వెళ్తూ దీన్‌దయాళ్‌నగర్‌లోని నాలాలో పడి మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని శోకం మిగిల్చింది.
కొనసాగుతున్న గాలింపు
ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్‌లోని తపోవన్‌కాలనీలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నవీన్ అనే వ్యక్తి వరద నీటి ప్రవాహానికి నీటిలో అదుపు తప్పి పడిపోయి సమీపంలోని చెరువులోకి కొట్టుకుపోయాడు. విషయం తెసుకున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది, విపత్తు నిర్వాహణ సిబ్బంది రంగంలోకి దిగారు. అర్ధరాత్రి దాటినా గాలింపు చర్యలు కొనసాగించారు. అయినప్పటికీ నవీన్ ఆచూకీ లభించలేదు.
రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం
చెరువు వద్దకు చేరుకున్న అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. నాలాలు, చెరువుల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం వలనే తరచు విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో... సహాయక బృందాలు గాలింపు చర్యలు నిలిపివేశాయి. తిరిగి ఇవాళ ఉదయం నుంచి గాలింపు మొదలు పెట్టనున్నారు. ఇటువంటి ప్రమాదాలు అరికట్టడానికి అధికార యంత్రాగం పకడ్భందీ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: మింగేస్తున్న నాలాలు.. చలించని అధికారులు!