భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. మంగళవారం మరణించిన వృద్ధుడు కరోనా లక్షణాలతోనే చనిపోయినట్లు ఆరోగ్య విభాగం ప్రకటించింది. కల్బుర్గికి చెందిన 76 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా లక్షణాలతో మృతిచెందారు. ఫిబ్రవరి 29న సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించగా.. అతడిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని అధికారులు తెలిపారు.
మార్చి 5న ఆస్తమా, బీపీతో అతడు కల్బుర్గిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు సమాచారం. ఆసుపత్రి సిబ్బంది అతడిని కరోనా పరీక్షలకు పంపారని.. మూడు రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి షిప్ట్ చేశారని తెలుస్తోంది. బాధితుడిని ఇంటికి తీసుకెళ్లగా.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చనిపోయాడని సమాచారం. హాస్పిటల్ వర్గాలు కరోనా లక్షణాలున్న వ్యక్తి బయటకు వెళ్లడానికి ఎలా అనుమతించాయనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై విచారణ కోసం కర్ణాటకకు చెందిన ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.