హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతెదర్వాజా ప్రాంతంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అతికిరాతకంగా నరికి చంపాడో భర్త. భార్యపై అనుమానంతో పథకం ప్రకారం ఆమెను కడతేర్చి నలుగురు పిల్లలను రోడ్డున పడేశాడు. జీవితాంతం తోడుంటానని చేసిన ప్రమాణాన్ని కాలరాసి క్రూరమృగంగా మారాడు.
అసలేంజరిగింది
మోతెదర్వాజాకు చెందిన బషీర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. రెండో భార్య సమీరా బేగంతో కలిసి ఉంటున్నాడు. వీరికి నలుగురు పిల్లలున్నారు. తాగుడుకు బానిసైన బషీర్ భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సమీర. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ అతని వక్రబుద్ధి మారలేదు. భార్యను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేసి అతికిరాతకంగా నరికి కడతేర్చాడు.
ఇదీ పథకం
ఆదివారం సాయంత్రం పిలలను షాపింగ్ కోసమని వెంటతీసుకెళ్లాడు బషీర్. తిరిగి ఎంత సేపటికీ రాకపోవడం వల్ల పిల్లల కోసం ఎదురు చూసిన సమీర నిద్రపోయింది. రాత్రి రెండున్నర గంటల సమయంలో ఇంటికొచ్చిన భర్త వెంటతెచ్చుకున్న గొడ్డలితో నిద్రపోతున్న భార్య మెడపై వేటువేశాడు. ఏమి జరిగిందో తెలిసేలోపలే ఆమె తుదిశ్వాస విడిచింది. దాడి అనంతరం బషీర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను చంపేశానని చెప్పాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఇదీ చూడండి: 'బాలికపై అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలి'