Horticulture Department: రాష్ట్రవ్యాప్తంగా చిన్న, పెద్ద 124 పట్టణాలకు ఏటా అవసరమైన కూరగాయల్లో 6 లక్షల టన్నుల కొరతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఈ స్థాయిలో కూరగాయలు పండించాలంటే పట్టణ ప్రాంతాలకు 50 కిలోమీటర్ల పరిధిలో లక్షా 20 వేల ఎకరాల వ్యవసాయ భూములు అవసరం. గత రెండేళ్లుగా కూరగాయ విత్తనాలకు రాయితీ పంపిణీని నిలిపివేసింది. దాదాపు అన్ని పట్టణాలకు సమీప ప్రాంతాల్లో కూరగాయలు పండించడానికి రైతులకు రాయితీపై విత్తనాలు ఇవ్వడానికి రూ.2 కోట్లను జూన్‌లో ఇవ్వాలని ఉద్యానశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇంట్లో పండిస్తే..నాణ్యమైన కూరగాయలు
ఏటా 3.5లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతుండగా 18 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. కానీ ఏడాదికి 28 లక్షల టన్నులు అవసరం. మిగతా 10 లక్షల టన్నులు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తెచ్చి విక్రయిస్తున్నారు. ఈ 10 లక్షల్లో పట్టణాలకు కొరత ఉన్నవే 6 లక్షల టన్నులున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని కుటుంబాలు ఆసక్తిగా ఇంటి భవనాలపై పండిస్తున్నాయి.
బెంగళూరులో ఎక్కువగా భవనాలపై పండిస్తున్నందున రాష్ట్రంలోనూ ఈ దిశగా ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. రెడ్‌హిల్స్‌లోని ఉద్యాన శిక్షణ సంస్థ పండిస్తున్న కూరగాయ పంటలను ప్రత్యక్షంగా చూపించి ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటిపై కూరగాయలు పండించడానికి అవసరమైన సామగ్రి, ఎరువులరూపంలో రూ.3 వేల వరకూ రాయితీ ఇస్తారు. ఇంటి పెరట్లో లేదా మిద్దెపై పండించే పంటలవల్ల రసాయనాలులేని కూరగాయలు లభిస్తాయని ఉద్యానశాఖ సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఏ ప్రాంతంలో ఏ కూరగాయలు పండుతాయో అక్కడ వాటిసాగును పెంచడానికి రాయితీలో విత్తనాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు సర్కారు సమాయత్తం.. నేడు కొన్నిచోట్ల శ్రీకారం!
మామిడి పండ్లు కిలో రూ.2.70లక్షలు- సెక్యూరిటీ కోసం 15 సూపర్ డాగ్స్!