Highcourt on Bjp Files Habeas Corpus Petition : బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం నేడు విచారించనుంది. పిటిషన్లో ఆరుగురిని బీజేపీ ప్రతివాదులుగా చేర్చింది.
తన అత్త దశదిన కర్మలో పాల్గొనడానికి బండి సంజయ్ కరీంనగర్ వెళితే... పోలీసులు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారని... ఎందుకు అరెస్టు చేస్తున్నారన్న విషయాన్ని కనీసం భార్యకు కూడా చెప్పలేదని పిటిషన్లో బీజేపీ నేత సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించి అరెస్ట్ చేశారని... గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు రాత్రి భోజనం తర్వాత టాబ్లెట్లను కూడా వేసుకోనివ్వలేదని పిటిషన్లో తెలిపారు.
సీఆర్పీసీ 50 కింద అరెస్టు చేస్తే కుటుంబసభ్యులకు చెప్పాలన్న పిటిషనర్.. ఆయన్ను అరెస్టు చేసే సమయంలో కనీస నిబంధనలను పోలీసులు పాటించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం, డీజీపీ, రాచకొండ, కరీంనగర్ సీపీలతో పాటు కరీంనగర్, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చారు. బండి సంజయ్‌ను హైకోర్టులో హాజరుపరిచే విధంగా ప్రతివాదులను ఆదేశించాలని పిటిషన్లో ధర్మసనాన్ని కోరారు. మరోవైపు అప్రజాస్వామికంగా బండి సంజయ్‌ను అరెస్టు చేయడంపై.. బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
బండి సంజయ్‌పై సుమోటో కేసు : మరోవైపు కరీంనగర్ రెండో పట్టణ పీఎస్‌లో బండి సంజయ్‌పై సుమోటో కేసు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 151 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కరీంనగర్ టూటౌన్ సీఐ లక్ష్మీబాబు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ జారీ చేశారు. పదో తరగతి పేపర్లు లీకయ్యాయని విద్యార్థుల్లో గందరగోళం నెలకొల్పారని అందులో పేర్కొన్నారు.
అనుచరులను రెచ్చగొడుతున్నారని అరెస్టు : వికారాబాద్, హనుమకొండ జిల్లాల్లో పేపర్లు లీకైనట్లు.. ఈ మేరకు బండి సంజయ్ ప్రచారం చేసినట్లు అభియోగం నమోదైందని పోలీసులు తెలిపారు. అదేవిధంగా మీడియాకు, సోషల్ మీడియాకు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. అనుచరుల ద్వారా పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళనలకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. జ్యోతినగర్‌లోని ఆయన ఇంట్లో బండి సంజయ్‌ను అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: